తెలంగాణలో భారీ స్థాయిలో 5 లక్షల కోట్ల భూ స్కామ్ నడుస్తోందని హిందుత్వవాది చీకోటి ప్రవీణ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇండస్ట్రియల్ భూములను ఔటర్ రింగ్ రోడ్ అవతలికి తరలించే నెపంతో డబుల్ రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకువచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాఫియాకు దారితీసిందని ఆయన విమర్శించారు. ఇండస్ట్రియల్ భూములను రెసిడెన్షియల్‌గా మార్చుకునే వెసులుబాటు వెనుక పెద్ద ఎత్తున భూ దందా జరుగుతోందన్నారు.
కాంగ్రెస్ హైకమాండ్ అవసరాల కోసమే ఈ స్కామ్‌ల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రస్తుతం కర్ణాటక తర్వాత తెలంగాణనే కాంగ్రెస్‌కు “ఫ్రెష్ ఏటీఎం”గా మార్చారని ఆరోపించారు. ఒక్క రూపాయి అక్రమానికి అవకాశం ఉన్నా వదలకుండా దోచుకునే విధానమే కాంగ్రెస్ రాజకీయమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఫుట్‌బాల్ మ్యాచ్ పేరుతో సింగరేణి నిధుల నుంచి రూ.100 కోట్లు ఖర్చు చేయడం ప్రజాధనాన్ని వృథా చేయడమేనని చీకోటి ప్రవీణ్ మండిపడ్డారు. అంతర్జాతీయ ఆటగాడు మెస్సీని బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టడం గ్రామీణ ప్రజలకు ఎలాంటి ఉపయోగం చేయదని అన్నారు. అదే నిధులను తెలంగాణకు చెందిన మహిళా క్రికెటర్లు వంటి దేశానికి గౌరవం తెచ్చిన క్రీడాకారులపై ఖర్చు చేసి ఉంటే ప్రజలు గర్వపడేవారని వ్యాఖ్యానించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని, అప్పట్లో డీసీపీ రాధాకృష్ణ తనను బెదిరించారని చీకోటి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, హీరోయిన్లను బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, ఎంతమంది ఫోన్లు ట్యాప్ అయ్యాయో, ఎవరి ఆదేశాలతో జరిగిందో ప్రజల ముందు వెల్లడించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉందన్నారు.
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు హయాంలో జరిగిన స్కామ్‌లన్నింటిపై విచారణ జరిపి, ఎంత పెద్ద నాయకులైనా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేవలం అరెస్టులతో సరిపెట్టకుండా వ్యవస్థను ఎలా దుర్వినియోగం చేశారో ప్రజలకు తెలియజేయాల్సిందేనని స్పష్టం చేశారు. సీబీఐ విచారణ జరిగితేనే నిజాలు బయటకు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
తాను రాజకీయాల్లోకి వచ్చినది హిందుత్వాన్ని కాపాడుకోవడానికేనని, అదే తన మొదటి ప్రాధాన్యత అని చీకోటి ప్రవీణ్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి హిందువులపై చిత్తశుద్ధి లేదని, చివరికి ప్రజలు ఓట్ల ద్వారానే సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

