కర్నూలు బస్సు దుర్ఘటనపై అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం — “ఇది ప్రమాదం కాదు, రాజకీయ హత్య”

కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ బస్సు దుర్ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. ఓకే టీవీతో మాట్లాడుతూ ఆయన ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థల నిర్లక్ష్యం, ప్రభుత్వాల వైఫల్యం, మరియు రాజకీయ మాఫియా మధ్య ఉన్న నక్సస్ వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని అన్నారు.

అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ —

“2013లో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగింది. 12 ఏళ్ల తర్వాత మళ్లీ అదే దృశ్యం. ఇది ప్రమాదం కాదు, ఇది ప్రభుత్వాల నిర్లక్ష్యంతో జరిగిన రాజకీయ హత్య,” అని వ్యాఖ్యానించారు.

అదే విధంగా నేషనల్ హైవే మీద బైక్ ఎలా వచ్చిందో మొదటగా విచారణ జరగాలని, కేంద్ర రహదారుల శాఖ పూర్తిగా విఫలమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు — తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక — ఈ విషయంలో సమాన బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ఇక రాష్ట్ర రవాణా శాఖలలో అవినీతి, ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా, రాజకీయ నేతలు, ఉన్నతాధికారుల మధ్య ఉన్న సూటి సంబంధాలను ఆయన బహిర్గతం చేశారు.

“ప్రజల ప్రాణాలు పోతున్నా మంత్రులు కూర్చొని చూడటం మాత్రమే చేస్తున్నారు. ఇది ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా వల్ల జరిగిన హత్య,” అని ఆయన అన్నారు.

మరియు తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తక్షణ రాజీనామా చేయాలని, మరణించిన కుటుంబాలకు కనీసం కోటీ రూపాయల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం, గృహ స్థలం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

అంతేకాదు, ప్రతి బస్సులో ఒక పోలీసు సిబ్బందిని నియమించి, ప్రయాణికుల లగేజీని విమానాశ్రయ పద్ధతిలో చెక్ చేయాలని కూడా సూచించారు.

“ఇలా ప్రైవేట్ ట్రావెల్స్ అనేవి కేవలం కంఫర్ట్ ఇస్తున్నాయి కానీ సేఫ్టీ మాత్రం లేదు. ఈ వ్యవస్థ పూర్తిగా మాఫియా చేతుల్లో పడిపోయింది,” అని ఆయన గట్టిగా విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *