అసెంబ్లీ బాయికాట్‌తో లాభం ఎవరికీ? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, పవర్ పాయింట్ రాజకీయంపై తీవ్ర విమర్శలు

ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పూర్తిగా ప్రశ్నించడం లేదని తాను అనట్లేదని, కానీ బీజేపీతో పోలిస్తే కాస్త మెరుగ్గానే ఉందని రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఇంకా ఎక్కువగా గ్రౌండ్‌లో తిరగాల్సిన అవసరం ఉందన్నారు. హరీష్ రావు, కేటీఆర్ వంటి నేతలు ప్రజల్లోకి వెళ్లి మరింత బలంగా ప్రశ్నించవచ్చని సూచించారు.

అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రోజు బీఆర్ఎస్ బాయికాట్ చేయడాన్ని ఆయన సమర్థించినా, ఆ తర్వాత కూడా అసెంబ్లీకి రాకపోవడమే పెద్ద తప్పు అని విమర్శించారు. ఒకరోజు నిరసన సరైనదే కానీ, ఆ తర్వాత ప్రతిపక్ష హోదాలో ప్రజల తరపున మాట్లాడకుండా ఉండటం రాజ్యాంగ విరుద్ధంగా కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయని తెలిపారు. పాలమూరు–చేవెళ్ల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన అంశంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్థాయికి వెళ్లాయని గుర్తు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఖండిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేయడం, రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఇబ్బందికరంగా మారిందని చెప్పారు.

ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే ముఖ్యమంత్రి సరైన సమాచారం తో అసెంబ్లీకి రావడం లేదని, ప్రభుత్వ అధికారులు కూడా కావాలనే పూర్తిస్థాయి ఫైల్స్, లేఖలు చూపించట్లేదని అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తొలి ఆరు నెలల్లోనే పాలమూరు ప్రాజెక్ట్‌పై నీటి వాటాల కోసం రాసిన కీలక లేఖను రేవంత్ రెడ్డి ముందు పెట్టకపోవడం పెద్ద రాజకీయ కుట్రలా కనిపిస్తోందన్నారు.

ఆ లేఖను అసెంబ్లీలో ప్రభుత్వం చూపించకపోయినా, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా బయట పెట్టడం రాజకీయంగా కీలకంగా మారిందన్నారు. ఇది ప్రభుత్వ వ్యూహాల్లో లోపాన్ని బయటపెట్టిందని వ్యాఖ్యానించారు.

ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ లేఖ తెలిసే దాచారా? లేక శాఖ అధికారులు కావాలనే సమాచారం ఇవ్వలేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పారు. ప్రభుత్వాలు మారినా ఫైల్స్ మారవని, ప్రతి అంశానికి సంబంధించిన రికార్డులు ప్రభుత్వంలో ఉంటాయని గుర్తు చేశారు. అలాంటి కీలక ఫైల్ ముఖ్యమంత్రి ముందు ఎందుకు పెట్టలేదన్నదే అసలు ప్రశ్నగా నిలుస్తోందన్నారు.

మొత్తానికి ఈ రాజకీయ గందరగోళంలో నష్టపోయింది రేవంత్ రెడ్డే అని, సబ్జెక్ట్‌పై పూర్తి అవగాహన లేకుండా మాట్లాడటం, చుట్టూ ఉన్న కోటరీపై పూర్తిగా ఆధారపడటం భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే సీఎం పదవి సంగతి అటుంచి, భవిష్యత్తులో ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి కూడా ఉండకపోవచ్చని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *