హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లు మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిది నెలలుగా ప్రభుత్వ ఆఫీసులు, అధికారులను కలిసినా సమస్యలు పరిష్కారం కాలేదని జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ బోర్డ్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ,
“2012 తర్వాత ఇప్పటివరకు ఆటో మీటర్ రేట్లు పెరగలేదు. పెట్రోల్, రోడ్డు టాక్స్, జరిమానాలు అన్ని పెరిగాయి కానీ మా ఆదాయం పెరగలేదు. బస్సులకు, ఇతర సేవలకు ధరలు పెంచి ఆటో డ్రైవర్ల సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదు.”
యూనియన్ నాయకులు తెలిపారు, అక్రమంగా తిరుగుతున్న ఇతర జిల్లాల ఆటోలు, వైట్ ప్లేట్ బైకులు, బైక్ టాక్సీలు, ఓలా-ఉబర్ లాంటి యాప్స్ ఆటో డ్రైవర్లను దెబ్బతీశాయని చెప్పారు.
డ్రైవర్ల ప్రధాన డిమాండ్లు:
- 🔹 మీటర్ ఫేర్ పెంపు
- 🔹 డిస్ట్రిక్ట్ ఆటో వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు
- 🔹 బైక్ టాక్సీలపై నిషేధం
- 🔹 5 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అమలు
- 🔹 ప్రతి ఆటో డ్రైవరికి సంవత్సరానికి ₹12,000 హామీ అమలు
జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చరిక
“ఇంకా 15 రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే ఆర్టీఓ కార్యాలయం ముందు ఆటోలు పార్క్ చేసి ధర్నాలు చేస్తాం. అవసరమైతే అసెంబ్లీ ముట్టడిస్తాం.”
కొంతమంది ఆటో డ్రైవర్లు భావోద్వేగంతో మాట్లాడుతూ,
“ఫ్రీ బస్ సర్వీసులు, బైక్ టాక్సీలు, యాప్ బుకింగ్స్ కారణంగా మాకు పని తగ్గిపోయింది. మా కుటుంబాలు కష్టాల్లో ఉన్నాయి. ప్రభుత్వం హామీలు నెరవేర్చాలి.”
ప్రస్తుతం ఆటో యూనియన్లు రాష్ట్రవ్యాప్తంగా ఏకతాటిపైకి రావడంతో రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి.

