కవిత స్థానంలో అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి.. కాంగ్రెస్‌లో కదలికలు

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తాజాగా ఆమోదించారు. దీంతో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానం అధికారికంగా ఖాళీ అయ్యింది.

2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే బీఆర్‌ఎస్‌ పార్టీతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆమెను సస్పెండ్ చేశారు. ఈ పరిణామాల అనంతరం గతేడాది సెప్టెంబర్ 3న కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన శాసన మండలి సమావేశాల్లో కూడా తన రాజీనామాను ఆమోదించాలని మండలి ఛైర్మన్‌ను ఆమె కోరారు. ఎట్టకేలకు ఇప్పుడు ఆ రాజీనామాకు ఆమోదం లభించింది.

ఇదిలా ఉండగా, కవిత ఖాళీ చేసిన ఎమ్మెల్సీ స్థానం నుంచి మంత్రి అజారుద్దీన్‌ను పోటీకి దింపేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అజారుద్దీన్ ఏ సభకు సభ్యుడు కాకపోయినా, గవర్నర్ కోటాలో ఆయనకు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆరు నెలల్లోగా ఆయన శాసనసభ లేదా శాసనమండలికి ఎన్నిక కావాల్సి ఉంటుంది.

దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి గవర్నర్ నుంచి ప్రత్యేక అనుమతి పొందడం, రెండోది ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎన్నిక కావడం. ఇప్పుడు కవిత రాజీనామాతో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఖాళీ కావడంతో, అదే స్థానం నుంచి అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా ఎన్నిక చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిణామంతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. కవిత రాజకీయ భవిష్యత్ ఒక వైపు చర్చనీయాంశంగా మారగా, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అజారుద్దీన్ ఎమ్మెల్సీ ఎన్నికపై దృష్టి సారించింది. రానున్న రోజుల్లో ఈ అంశం మరింత రాజకీయ వేడిని పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *