అవినీతి కేసుల్లో ఇద్దరు మంత్రులు జైలుకి వెళ్లడం ఖాయం: కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెంచుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులు అవినీతి కేసుల్లో తప్పకుండా జైలుకు వెళ్లనున్నారని ఆయన స్పష్టం చేశారు. చట్టంలోని లొసుగులను ఆశ్రయించుకొని ఆ ఇద్దరు మంత్రులు వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, ఈ ఇద్దరు మంత్రుల అవినీతిపై ఇంటెలిజెన్స్ రిపోర్టులు తెప్పించుకుంటున్నామని చెప్పారు. వారి అవినీతికి సంబంధించిన “అవినీతి భాగవతం”ను త్వరలోనే ప్రజల ముందుకు తీసుకువస్తామని ప్రకటించారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అంతర్గతంగా చర్చించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఉపయోగించిన భాష సరికాదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు హుందాగా మాట్లాడాలని సూచించారు. గతంలో కేసీఆర్ కూడా ఇలాంటి భాష ఉపయోగించినప్పుడు తాము అప్పుడే ఖండించామని గుర్తు చేశారు. అయితే కేసీఆర్ కుటుంబమే తెలంగాణకు “పెద్ద శని” అని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని తీవ్రంగా మండిపడ్డారు.
కృష్ణ జలాల వాటా విషయంలో మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదని బండి సంజయ్ విమర్శించారు. తెలంగాణకు న్యాయంగా 575 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా, అప్పటి సీఎం కేసీఆర్ 299 టీఎంసీలకే సంతకం చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని మొదటిసారి బయటకు తీసుకొచ్చింది తానేనని, అవసరమైతే ఆధారాలు కూడా వెల్లడించేందుకు సిద్ధమని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, కేవలం 9,000 కోట్ల అవకతవకలకే విచారణ ఎందుకు పరిమితం చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబానికి ప్రత్యక్ష ప్రమేయం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. ఆ సమయంలో తన పేరు సహా పలువురి పేర్లు నక్సలైట్ జాబితాలో చేర్చారని, 6,000 మందికి పైగా ప్రముఖుల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేసిన చరిత్ర కేసీఆర్‌దేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇక కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి పెరుగుతోందని, ఎమ్మెల్యేలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని బండి సంజయ్ జోస్యం చెప్పారు. తమకు అందుతున్న సమాచారం ప్రకారం చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరాశ, నిస్పృహతో ఉన్నారని, ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర తాను ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నానని బహిరంగంగా ప్రకటించినప్పటికీ, స్పీకర్ స్పందించకపోవడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్‌ను ఓడించడమే బీజేపీ లక్ష్యమని ప్రకటించిన బండి సంజయ్, భాగ్యనగర్‌ను “మజ్లిస్ ముక్తం” చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తీసుకువస్తాయని ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

