తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం ఇంకా పూర్తి స్థాయిలో అమలుకాని పరిస్థితిలోనే మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అధికారంలోకి రాకముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటివరకు ఆ హామీని చట్టబద్ధంగా అమలు చేయలేదని బీసీ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరుగుతుందన్న ప్రచారం జరిగినప్పటికీ, కనీసం ఒక మంత్రి లేదా ఎమ్మెల్యే కూడా 42 శాతం బీసీ రిజర్వేషన్ అంశాన్ని సభలో ప్రస్తావించకపోవడం బీసీ సమాజాన్ని ఆవేదనకు గురి చేస్తోంది. కులగణన, డెడికేషన్ కమిషన్, జీఓలు, ఆర్డినెన్స్‌లు అంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని బీసీ నేతలు విమర్శిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ బీసీలను 37 శాతం లేదా అంతకంటే తక్కువ శాతానికి పరిమితం చేసే ప్రయత్నం జరుగుతోందని బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆరోపిస్తోంది. డెడికేషన్ కమిషన్ పేరుతో 57 శాతం జనాభా ఉన్న బీసీలకు కేవలం 31 శాతం మాత్రమే కేటాయించి, మెజారిటీ సీట్లను జనరల్ కేటగిరీగా చూపించడం అన్యాయమని వారు అంటున్నారు.
ఈ పరిస్థితికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా బీసీ సమాజాన్ని చైతన్యపరిచేందుకు బీసీ పొలిటికల్ ఫ్రంట్ బస్సు యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఇది కేవలం రాజకీయ యాత్ర కాదని, రెండు కోట్లకు పైగా బీసీ ప్రజానికంలో హక్కులపై అవగాహన కల్పించే ఉద్యమమని నాయకులు స్పష్టం చేస్తున్నారు.
సర్పంచ్ ఎన్నికల్లో బీసీలు తమ శక్తిని నిరూపించుకున్నారని, అవసరమైతే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో రాజకీయ సమాధానం ఇస్తామని బీసీ నేతలు హెచ్చరిస్తున్నారు. 42 శాతం రిజర్వేషన్ అమలు అయ్యే వరకు పోరాటం ఆగదని వారు స్పష్టంగా చెబుతున్నారు.

