కామారెడ్డిలో బీసీ ఫ్రంట్ ఉక్రోష సభ — 42% రిజర్వేషన్ల సాధన కోసం సమర యాత్ర!
తెలంగాణలో బీసీల హక్కుల సాధన కోసం బీసీ పొలిటికల్ ఫ్రంట్ మరోసారి గళమెత్తింది. చైర్మన్ బాలరాజు గౌడ్ ప్రకటించిన ప్రకారం, నవంబర్ 15న కామారెడ్డిలో భారీ ఉక్రోష సభ నిర్వహించబడుతుంది. ఈ సభలో వేలాది మంది పాల్గొననున్నారు. ప్రధాన డిమాండ్ — బీసీలకు 42% రిజర్వేషన్‌ను చట్టపరంగా అమలు చేయాలి అన్నది.
బీసీ ఫ్రంట్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ ఎస్సీ ఎస్టీ జాక్, ధర్మ సమాజ్ పార్టీ, జస్టిస్ ఈశ్వరయ్య తదితర నాయకులు అందరూ కలిసి ఈ ఉద్యమానికి నాంది పలకనున్నారు. బాలరాజు గౌడ్ మాట్లాడుతూ,
“24 నెలలు గడిచినా జీవోలతోనే కాలయాపన జరుగుతోంది. మేము చట్టపరంగా రిజర్వేషన్ కోరుతున్నాం. తమిళనాడులోలా నైన్ షెడ్యూల్‌లో చేర్చి చట్టం చేయాలి. అప్పుడే నిజమైన సామాజిక న్యాయం జరుగుతుంది,” అన్నారు..
అతను మరింతగా వ్యాఖ్యానిస్తూ — మూడు ప్రధాన పార్టీలు, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
“రాష్ట్రంలో గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉంది, కేంద్రంలో రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లు అటకెక్కింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని పార్టీలను కలుపుకొని ఢిల్లీలో చర్చ జరగాలి. పార్లమెంట్‌లో చర్చ జరిగితేనే రిజర్వేషన్ చట్టబద్ధం అవుతుంది,” అన్నారు.
బీసీ ఫ్రంట్ ప్రకటన ప్రకారం, 42% రిజర్వేషన్లకు చట్టపరంగా ఆమోదం వచ్చే వరకు స్థానిక సంస్థల ఎన్నికలకు అనుమతించబోమని స్పష్టం చేశారు.
“మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజాలుగా 90% మంది ఉన్నాం. మేము ఐక్యమై పోరాటం చేస్తే ఏ అడ్డంకీ ఎదురవదు,” అని బాలరాజు గౌడ్ చెప్పారు.
తదుపరి దశలో ఢిల్లీలో కూడా బీసీ సంఘాలు కలిసి శీతాకాల పార్లమెంట్ సమావేశాల సమయంలో పోరాటం చేపట్టనున్నాయని ప్రకటించారు.
“తెలంగాణ ఉద్యమం లాగానే 42% సాధన ఉద్యమం కూడా చరిత్రలో నిలిచేలా చేస్తాం,” అని బీసీ ఫ్రంట్ ప్రకటించింది.

