రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో న్యాయం జరగలేదంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బీసీ సంఘాలు, ఉద్యమ కమిటీలు, రాజకీయ ఫ్రంట్లు ఏకతాటిపైకి వచ్చి, “ఈ ఎన్నికలు న్యాయమైనవి కావు” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, పలు సంఘాలు నిరసనలు చేపట్టగా, మరోవైపు న్యాయస్థానాల్లో పిటిషన్లు కూడా దాఖలు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను తక్షణమే వాయిదా వేయాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ తమ కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధం చేస్తామని చెప్పి, ఇప్పుడు మాట తప్పిందని బీసీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆరు నెలల కాలంలో రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్ హామీ అమలు చేయాల్సి ఉండగా, వివిధ కమిటీలు, ప్రక్రియలు చూపి సమయం గడిపిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తమిళనాడు తరహాలో 69% రిజర్వేషన్ అమలవుతుంటే, తెలంగాణలో అది ఎందుకు సాధ్యం కాలేదని బీసీలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో అఖిలపక్ష సమావేశం లేకుండా, కేంద్రానికి స్పష్టమైన ప్రతిపాదనలు పంపకుండా ఎన్నికల ప్రక్రియను కొనసాగించడం వెనుక రాజకీయ ఉద్దేశముందని ఆరోపిస్తున్నారు.
“రాష్ట్రంలో రెడ్డిల పాలన కొనసాగించేందుకు, గ్రామస్థాయిలో బీసీల అధికారం దక్కకుండా నిరోధించే ప్రయత్నమే ఇది” అని పలు బీసీ నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కొన్నిచోట్ల విచారణ కొనసాగుతుండగా నామినేషన్లు స్వీకరించడం న్యాయబద్ధం కాదని, ఎన్నికల ప్రక్రియ నిలిపివేయకపోతే పెద్ద ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
ఎన్నికలు జరిగితే జనరల్ కేటగిరీలో బీసీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పోటీ చేసి గెలవాలని, “మా జనాభాకు తగ్గట్టుగా అధికారం రావాలి” అని బీసీ ఫ్రంట్ నేతలు పిలుపునిచ్చారు.
చివరగా, బీసీ సంఘాలు కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ మూడు పార్టీలు కూడా బీసీలను మోసం చేశాయని ఆరోపిస్తూ, రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీలకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చాయి

