మున్సిపల్ ఎన్నికలకు ముందు బీసీ రిజర్వేషన్లపై రాజకీయ మౌనం: 56% టికెట్లు ఇవ్వకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తాం – బీసీ జేఏసీ హెచ్చరిక

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కావాలని పక్కదారి పట్టిస్తున్నారని బీసీ సంఘాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. గంగపుత్ర సంఘం, బీసీ జేఏసీ, మహిళా సంఘాలు, వివిధ బీసీ సంక్షేమ సంఘాల నేతలు పాల్గొన్న సమావేశంలో ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై ఘాటు విమర్శలు చేశారు.

ఈ సమావేశంలో మాట్లాడిన బీసీ జేఏసీ నేతలు, తెలంగాణలో జరిగిన కులగణన ప్రకారం బీసీలు 56 శాతం జనాభా ఉన్నప్పటికీ, మున్సిపల్ ఎన్నికల్లో ఆ మేరకు రిజర్వేషన్లు గానీ, పార్టీ టికెట్లు గానీ ఇవ్వడంపై స్పష్టత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన రాజకీయ పార్టీలు ఇప్పుడు మౌనంగా ఉన్నాయని విమర్శించారు.

రేపు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని సమాచారం ఉన్నప్పటికీ, బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పీసీసీ అధ్యక్షుడు, అలాగే ప్రతిపక్ష పార్టీలు ఎవరూ మాట్లాడకపోవడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్, సిట్ విచారణలు, స్కామ్‌ల పేరుతో రోజూ డైవర్షన్ రాజకీయాలు నడుపుతూ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని చర్చకు రానివ్వడం లేదని తెలిపారు.

కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో “కులగణన ప్రకారం ఎవరి వాటా వారికి ఇవ్వాలి” అని చెప్పిన మాటలను గుర్తు చేసిన నేతలు, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ మాటను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పార్టీ పరంగా అయినా మొత్తం 121 మున్సిపాలిటీల్లో 68 చైర్మన్ పదవులు, 1150కు పైగా కౌన్సిలర్/కార్పొరేటర్ స్థానాలు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

బీసీలకు 56 శాతం టికెట్లు ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర రాజకీయ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనను కూడా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు ఓటు అనే ఆయుధంతో తమ సత్తా చూపించారని, అవసరమైతే మళ్లీ అదే రీతిలో రాజకీయ పార్టీలకు బుద్ధి చెబుతామని ప్రకటించారు.

బీసీ సమాజాన్ని మోసం చేస్తే వచ్చే ఎన్నికల్లో మూడు ప్రధాన రాజకీయ పార్టీలకూ తగిన గుణపాఠం తప్పదని బీసీ జేఏసీ నేతలు స్పష్టంగా హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *