2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కాంగ్రెస్ లేదా బీజేపీ కారణం కాదని, పార్టీ చేసిన తప్పులే ప్రధాన కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం యాదాద్రి జిల్లా భువనగిరిలోని డీబీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన కొత్త సర్పంచులు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ కేడర్‌ను పట్టించుకోలేదని, గ్రామస్థాయి నాయకత్వాన్ని నిర్లక్ష్యం చేశామని కేటీఆర్ అంగీకరించారు. సర్పంచులు, ఎంపీటీసీలకు రావాల్సిన బిల్లులు ఇవ్వకపోవడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. దీంతో 2023 ఎన్నికల్లో కేడర్ ఉత్సాహంగా పనిచేయలేదని, ఆ ప్రభావమే ఓటమిగా మారిందని పేర్కొన్నారు.
“మనల్ని ఓడించింది మనమే. పార్టీని బలోపేతం చేయడం మర్చిపోయాం. కమిటీల ఏర్పాటు జరగలేదు. స్థానిక నాయకులను పక్కన పెట్టాం” అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలు ఆడా మగా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని, పిరాయింపులు జరుగుతున్నా ఆయనకు కనిపించడం లేదని ఆరోపించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి తన జీవితకాలంలో సంపాదించుకున్న గౌరవాన్ని వదులుకుని రేవంత్ రెడ్డి వైపు వెళ్లడం దురదృష్టకరమని అన్నారు.
అయినా స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్వ వైభవాన్ని తిరిగి సాధించిందని కేటీఆర్ పేర్కొన్నారు. యాదాద్రి జిల్లాలో 161 మంది సర్పంచులు గెలవడం పార్టీ శ్రేణులకు వెయ్యి ఏనుగుల బలం ఇచ్చిందని చెప్పారు. రాబోయే జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతుందని, భువనగిరి కోటపై గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు ఎవరి సొత్తు కాదని, అవి రాజ్యాంగబద్ధంగా ప్రజలకు దక్కాల్సిన హక్కులని అన్నారు. ఏ ఎమ్మెల్యే అయినా వాటిని ఆపలేరని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ‘పింక్ బుక్‌లో రాసుకుంటున్నాం’ అంటూ అధికార పార్టీపై ప్రతీకార హెచ్చరికలు చేయడం సరైంది కాదని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఏం చేస్తామన్నదే రాజకీయాల ఉద్దేశం కావాలని, ఇలాంటి పనికిమాలిన ప్రకటనలు అవసరం లేదని ప్రజలు భావిస్తున్నారు.

