గాలిలో పతంగుల జోరు… చైనా మాంజాతో ప్రాణాలు బేజారు

సంక్రాంతి పండుగ వచ్చిందంటే ప్రతి గల్లీలో పిల్లలు పతంగులు ఎగురవేస్తూ కనిపిస్తుంటారు. గాలిపటాలతో ఆడుకుంటూ ఆనందంగా గడపడం పండుగకు ప్రత్యేక ఆకర్షణ. కానీ ఆ సరదానే ఇప్పుడు ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. పతంగులను తెంచేయాలనే ఉద్దేశంతో హానికారక రసాయన రంగులతో తయారు చేసిన ‘చైనా మాంజా’ వినియోగం తీవ్ర ప్రమాదాలకు దారితీస్తోంది.

ఈ చైనా మాంజా తాకిన పక్షులు గాల్లోనే చనిపోతుండగా, మనుషుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. వాహనదారుల మెడకు చుట్టుకొని తీవ్ర గాయాలకు కారణమవుతుండటంతో అనేక ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ ముప్పును ముందే గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2017 జూలై 11న చైనా మాంజా విక్రయాలపై నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1966 ప్రకారం చైనా మాంజాను అమ్మినా, కొనుగోలు చేసినా, వినియోగించినా నేరమే. ఈ నిషేధిత మాంజాను విక్రయిస్తే ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించే అవకాశం ఉంది.

నిషేధం ఉన్నప్పటికీ సంక్రాంతి వేళ బహిరంగ మార్కెట్లలో ఈ సింథటిక్ దారాలు విచ్చలవిడిగా విక్రయమవుతున్నాయి. పండుగ పూట ఆనందంగా గడపాల్సిన కుటుంబాల్లో ఈ దారాలు అనూహ్య విషాదాన్ని నింపుతున్నాయి. సాధారణ దారంలా కనిపించే ఈ మాంజా, పదునైన కత్తిలా మారి ప్రాణాలను బలితీసుకునే ప్రమాదకర ఆయుధంగా మారింది.

తాజాగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టలో జరిగిన ఘటన అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఇంటర్ విద్యార్థి జశ్వంత్ బైక్‌పై వెళ్తుండగా గాలిలో వేలాడుతున్న చైనా మాంజా అతని మెడకు చుట్టుకుంది. తీవ్రంగా గాయపడిన అతడికి వైద్యులు ఏకంగా 19 కుట్లు వేశారు. అలాగే జగిత్యాల జిల్లా మెట్‌పల్లి దుబ్బవాడలో శ్రీహాన్ అనే నాలుగేళ్ల చిన్నారి మెడకు మాంజా దారం కోసుకుపోవడంతో 16 కుట్లు వేయాల్సి వచ్చింది.

ఇదే తరహాలో జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని మొండికుంట స్టేజ్ సమీపంలో గోపిరాజుపల్లి గ్రామానికి చెందిన పిడుగు ఐలయ్య మామిడి తోటలో పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, నిషేధిత చైనా మాంజా దారం తెగి మెడపై పడింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలై మూడు కుట్లు వేశారు. వరుస ఘటనలతో వాహనదారులు, పాదచారులు రోడ్లపై ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు.

చైనా మాంజా పక్షులకే కాదు, మనుషులకు కూడా అత్యంత ప్రమాదకరమని అటవీశాఖ అధికారులు, పోలీసులు, పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు. సంప్రదాయ పత్తి దారాన్ని ఉపయోగించాలని సూచిస్తున్నా, కొందరు వ్యాపారులు అక్రమంగా చైనా మాంజాను విక్రయిస్తున్నారు. నైలాన్, గాజు కోటింగ్ ఉన్న సింథటిక్ దారాలు కూడా ప్రమాదకరమేనని నిపుణులు చెబుతున్నారు. కంటికి కనిపించకుండా సన్నగా ఉండే ఈ దారాలకు పక్షులు చిక్కుకొని ప్రాణాలు కోల్పోతున్నాయి.

ప్రభుత్వం నిషేధం విధించినా క్షేత్రస్థాయిలో అమలు నామమాత్రంగానే కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పర్యావరణానికే కాకుండా ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ దారాల విక్రయాలను అరికట్టడంలో యంత్రాంగం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

చైనా మాంజాను పూర్తిగా దూరంగా పెట్టి సంప్రదాయ దారాన్ని మాత్రమే వినియోగించాలని పతంగుల వ్యాపారులు, అధికారులు సూచిస్తున్నారు. పతంగులు ఎగురవేసేటప్పుడు విద్యుత్ తీగలు, చెట్లు లేని ప్రదేశాలు ఎంచుకోవాలి. చెట్లకు లేదా తీగలకు చిక్కిన పతంగులను తీసేందుకు సాహసం చేయకూడదు. తెగిన గాలిపటాలను అందుకోవడానికి పరుగులు తీయకుండా, క్రీడా మైదానాల్లోనే పతంగులు ఎగురవేయడం భద్రమని సూచిస్తున్నారు. పండుగ ఆనందం ప్రాణాంతకంగా మారకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *