యూనివర్సిటీ భూములపై కాంగ్రెస్ కన్ను.. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా ప్రభుత్వ వ్యవహారం: కేటీఆర్ తీవ్ర విమర్శలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్‌ను తలపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. విద్యాసంస్థలు, యూనివర్సిటీల అభివృద్ధి కంటే భూములు లాక్కోవడంపైనే ప్రభుత్వ దృష్టి ఉందని మండిపడ్డారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ భూములపై ప్రభుత్వం కన్నేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రెండున్నరేళ్లలో మారిపోతుందని, ఆ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి యూనివర్సిటీ విస్తరణకు కావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోయినా భవిష్యత్‌లో యూనివర్సిటీల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్‌పాన్షన్ బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో విద్యార్థులతో పాటు తాము నిలబడతామని, అవసరమైతే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తామని చెప్పారు.

ఇది రాజకీయ పార్టీ మీటింగ్ కాదు, రాజకీయ నాయకుడి మీటింగ్ కూడా కాదని, విద్యార్థుల హక్కుల కోసం జరుగుతున్న పోరాటమని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని అన్ని వేదికలపై, రాజ్యసభలో కూడా లేవనెత్తుతామని తెలిపారు. మీడియా ఈ ఇష్యూకు మద్దతుగా నిలుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో జరిగినట్టే ఇప్పుడు మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ భూములను కూడా లాక్కునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న ఏకైక ఉర్దూ స్టడీస్ యూనివర్సిటీపై ఇలా కన్నేయడం ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB), హెచ్‌సీయూ వంటి టాప్ ఇన్‌స్టిట్యూషన్ల భూముల్ని కూడా తీసుకుంటామనడం ప్రభుత్వ మానసిక స్థితిని చూపిస్తోందన్నారు.

‘‘ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో అదే పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం సీరియల్ కిల్లర్లలా కాదు.. సీరియల్ స్నాచర్లలా భూములు లాక్కుంటోంది’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గతంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 100 ఎకరాలు తీసుకున్న ఉదంతాన్ని గుర్తు చేశారు. అప్పట్లో విద్యార్థులు ఆందోళన చేసినా, ఉద్యమాన్ని అణిచివేసి భూములు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో కూడా 400 ఎకరాల భూమి తీసుకునే ప్రయత్నం జరిగిందని, చివరికి సుప్రీంకోర్టు జోక్యంతోనే ఆ ప్రక్రియ ఆగిందన్నారు.

సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఈ వ్యవహారంలో రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని స్పష్టం చేసి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయాలని సూచించినా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి బీజేపీ ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని ఆరోపించారు.

ఇప్పుడు ఐఎస్బీకి నోటీసులు ఇచ్చి 100 ఎకరాలు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీకి నోటీసులు ఇచ్చి 50 ఎకరాలు లాక్కునే ప్రయత్నం జరుగుతోందన్నారు. విద్యాసంస్థలను అభివృద్ధి చేయాలన్న దృష్టి, ఇంగితం ఈ ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు.

ఉద్యోగాల అంశంపైనా కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రెండేళ్లు దాటినా 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, ప్రశ్నించిన యువతపై లాఠీచార్జ్ చేయడం, అరెస్టులు చేయడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి ఒక షాప్ ఓపెనింగ్‌కు వెళ్లేందుకు ప్రజలు అడ్డం పడతారన్న భయంతో పోలీసులతో ప్రభుత్వం బతుకుతోందని వ్యాఖ్యానించారు.

‘‘రెండు లక్షల ఉద్యోగాలు అని మాట ఇచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడున్నారు? దమ్ముంటే సమాధానం చెప్పాలి. ఉద్యోగాలు ఇవ్వకుండా యూనివర్సిటీ భూములు లాక్కుంటే తెలంగాణ యువత చూస్తూ ఊరుకోదు’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు.

తెలంగాణ యువతతో, విద్యార్థులతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ డ్రామాలను ప్రజలంతా గమనించాలని కోరుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *