మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన కరారు? 300 డివిజన్లతో ఎన్నికలకు సర్కార్ సన్నాహాలు

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)ని మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రక్రియ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజగిరి అనే మూడు మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే కీలక స్థాయి సమావేశాలు నిర్వహించగా, విభజనపై పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందినట్లు సమాచారం.

ఔటర్ రింగ్ రోడ్ వరకు 2071 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు భాగాలుగా విభజించనున్నారు. ప్రస్తుతం ఉన్న 12 జోన్లు, 300 డివిజన్లలో భాగంగా ఆరు జోన్లు, 150 డివిజన్లతో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. 76 డివిజన్లతో సైబరాబాద్, 74 డివిజన్లతో మల్కాజగిరి మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి.

సికింద్రాబాద్‌లోని రాంగోపాల్‌పేట నుంచి శంషాబాద్ వరకు హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిగా ఉండనుందని సమాచారం. నార్సింగ్ నుంచి షామీర్పేట సమీపం వరకు విస్తరణ జరగనుందని బల్దియాలోని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ విభజనను జనవరి 2న అసెంబ్లీ సమావేశాల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫిబ్రవరి చివరి నాటికి తుది నోటిఫికేషన్ జారీ చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

కొత్తగా ఏర్పడే మూడు కార్పొరేషన్లకు ప్రత్యేక భవనాల కోసం 10 ఎకరాల చొప్పున భూమి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల బదిలీ అయిన అదనపు కమిషనర్లే భవిష్యత్తులో ఈ కొత్త కార్పొరేషన్ల కమిషనర్లుగా వ్యవహరించే అవకాశముందని చర్చ సాగుతోంది.

ఇదిలా ఉండగా, జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డివిజన్ల సంఖ్యను 300కి పెంచడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కావాలనే అదనంగా 150 డివిజన్లు పెంచి కాంగ్రెస్‌కు అనుకూలంగా ఎన్నికల మ్యాప్‌ను మార్చుతున్నారని బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 45 డివిజన్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు స్వల్ప సీట్లే దక్కిన నేపథ్యంలో ఈ మార్పులు రాజకీయ ప్రయోజనాల కోసమేనని ప్రతిపక్షాల వాదన.

జనాభా ప్రాతిపదికన ఒక్కో డివిజన్‌కు 30 నుంచి 40 వేల మంది ఉండాలన్న నిబంధనను కొన్ని ప్రాంతాల్లో పాటించలేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఎంఐఎం ప్రభావం ఉన్న ప్రాంతాల్లో 30 వేల జనాభాతోనే రెండు, మూడు డివిజన్లు ఏర్పాటు చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై స్పష్టమైన మ్యాప్, గణాంకాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మూడు కార్పొరేషన్ల ఏర్పాటు కూడా ఎంఐఎంకు అనుకూలంగా ఉండేలా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తగా ప్రతిపాదించిన మూడో కార్పొరేషన్‌ను మైనారిటీ రాజకీయాలకు అనుకూలంగా రూపొందిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

అయినప్పటికీ, 300 డివిజన్లతోనే జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. కొత్త డివిజన్లు పెరగడంతో కొత్త నాయకులకు అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉండనుందని, ఈ ఎన్నికలు హైదరాబాద్ రాజకీయాలను కొత్త మలుపు తిప్పే అవకాశముందని చర్చ సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *