తెలంగాణ శాసనసభ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పోలీసుల సమస్యలపై సభ్యుడు తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి రథచక్రాలంటూ, వారు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సజావుగా చేరుతాయని స్పష్టం చేశారు. అయితే నేడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రమైన మనోవేదన, ఆవేదనలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు పీఆర్సీ ప్రకటించకపోవడం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురి చేస్తోందన్నారు. పీఆర్సీ, పెండింగ్ డీఏలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని చెప్పారు. 30–35 ఏళ్ల పాటు ప్రభుత్వానికి సేవ చేసిన రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు అందక చావు–బతుకుల మధ్య ఉన్నారని వ్యాఖ్యానించారు. ఉదయం తన ఇంటికే వచ్చి ఓ రిటైర్డ్ ఉద్యోగి తన గోడును చెప్పుకున్న ఘటనను సభ దృష్టికి తీసుకొచ్చారు. రిటైర్డ్ ఉద్యోగులను వేధించడం ప్రభుత్వానికి తగదని, వెంటనే వారి బకాయిలు చెల్లించాలని కోరారు.
సీపీఎస్ ఉద్యోగుల విషయంలోనూ ప్రభుత్వం హామీకి కట్టుబడి లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ సీపీఎస్‌ను ఓపీఎస్‌గా మారుస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే రెండేళ్లు గడిచినా ఓపీఎస్ అమలు కాకపోగా, సీపీఎస్ కింద ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ కూడా చెల్లించకుండా దారి మళ్లిస్తున్నారని విమర్శించారు. దీనివల్ల రెండు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వెంటనే కాంట్రిబ్యూషన్ చెల్లించి, ఓపీఎస్‌ను అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు.
పోలీస్ శాఖ సమస్యలపై కూడా సభలో ప్రస్తావించారు. ఐదు సరెండర్ లీవులు, టీఏ, డీఏ, స్టేషన్ అలవెన్సులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా పోలీసులు ఈ బకాయిలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గతంలో తాను ఫైనాన్స్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ఈ బకాయిలు చెల్లించామని గుర్తు చేశారు.
పోలీసులకు ఉన్న ఆరోగ్య భద్రత స్కీమ్‌ను పరిమితం చేయడం వల్ల కానిస్టేబుళ్లు తీవ్రంగా నష్టపోతున్నారని, కార్పొరేట్ వైద్యం పునరుద్ధరించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు పీఆర్సీ, పెండింగ్ డీఏలు, బకాయిలు, ఓపీఎస్ ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేస్తూ, రెండేళ్లు గడిచినా అమలు చేయకపోవడం మోసమేనని వ్యాఖ్యానించారు. ఇప్పటికే జరిగిన అన్యాయం చాలునని, ఇప్పటికైనా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పోలీసులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.

