ప్రశ్నిస్తే సిట్ నోటీసులేనా? ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: హరీష్ రావు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా, రాష్ట్రంలో నలుగురు కీలక కాంగ్రెస్ మంత్రులు అత్యవసరంగా సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన ఈ భేటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నట్లు సమాచారం. సుమారు రెండున్నర గంటలకు పైగా సాగిన ఈ సమావేశానికి మధ్యలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా హాజరయ్యారని తెలుస్తోంది.

ఈ సమావేశంలో ప్రధానంగా సింగరేణి బొగ్గు స్కామ్‌పై ఆంధ్రజ్యోతి, ఎన్టీవీ మీడియాలో వచ్చిన కథనాలు, వాటి వెనుక ఉన్న రాజకీయ శక్తులపై తీవ్రంగా చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది నేతలు కావాలనే పార్టీకి నష్టం కలిగించే విధంగా లీకులు ఇస్తున్నారనే ఆవేదన వ్యక్తమైనట్టు సమాచారం.

సీఎం రేవంత్ రెడ్డి పాలనా శైలిపై కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఇప్పుడు తాడో పేడో తేల్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది. ముఖ్యమంత్రి గైర్హాజరీలో, పీసీసీ చీఫ్ కూడా ఢిల్లీలో ఉన్న సమయంలో ఈ భేటీ జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఇది కేవలం ప్రభుత్వ పథకాల అమలుపై జరిగిన సాధారణ సమావేశమేనని పార్టీ అధికార వర్గాలు చెబుతున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అంతర్గత కొమ్ములాటలు ఇప్పుడు బహిర్గతమవుతున్నాయనే అభిప్రాయం బలపడుతోంది. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాలను ఏ దిశగా మళ్లిస్తాయో చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *