హైదరాబాద్‌లో 9,292 ఎకరాల పరిశ్రమ భూములపై మల్టీ-యూజ్‌ జోన్ల స్కెచ్‌… వేల కోట్లకు కాంగ్రెస్ పెద్దల ప్లాన్?

హైదరాబాద్‌లో పరిశ్రమల అభివృద్ధి కోసం దశాబ్దాల క్రితం కేటాయించిన విలువైన 9,292 ఎకరాల భూములపై ప్రభుత్వం కీలక మార్పులకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ భూములను ఇప్పుడు మల్టీ-యూజ్ జోన్లుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని పరిశ్రమ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన HILT-UP — Hyderabad Industrial Lands Transformation Policy (హిల్ట్ అప్) పేరుతో కొత్త విధానం ద్వారా పరిశ్రమల భూములను రియల్ ఎస్టేట్, వాణిజ్య, హౌసింగ్ మరియు ఇతర ప్రయోజనాలకు మళ్లించే వీలుగా మార్పులు చేస్తున్నారు. పరిశ్రమల కోసం కేటాయించిన భూములు ఇతర అవసరాలకు వినియోగిస్తే ఆ కేటాయింపు రద్దవుతుందనే నిబంధనలను పట్టించుకోకుండా ఈ ప్రక్రియ సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దీంతో పరిశ్రమల కోసం తక్కువ ధరలకు భూములు కేటాయించిన అసలు ఉద్దేశం పూర్తిగా తప్పిపోయిందని పరిశ్రమిక వేత్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 50–60 ఏళ్ల క్రితం నగర శివార్లలో ఏర్పాటు చేసిన 22 పరిశ్రమ వాడలను ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఉపయోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇక ప్రభుత్వం భూవినియోగ మార్పిడికి రిజిస్ట్రేషన్ విలువలో 30% చెల్లిస్తే చాలు అనే సడలింపులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో భూముల అసలు ధర కంటే ఎంతో తక్కువగా చెల్లించి వేల కోట్లు లాభం పొందే పరిస్థితి ఏర్పడుతుందని విమర్శకులు మండిపడుతున్నారు.

ఓ వైపు ఎన్నికల ముందు “ప్రభుత్వ భూముల అమ్మకాన్ని రద్దు చేస్తాం” అని చెప్పిన అధికార పార్టీ… ఇప్పుడు అదే భూములను మరింత వేగంగా అమ్మేస్తోందని ప్రతిపక్షం దాడి చేస్తోంది.
పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు, పెట్టుబడులు పెరగాలి కానీ పరిశ్రమల కోసం కేటాయించిన భూములను రియల్ ఎస్టేట్‌కు మార్చటం వల్ల భవిష్యత్తు అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్‌లోని విలువైన ప్రభుత్వ, పరిశ్రమ భూములను అమ్మే ప్రయత్నాలు ప్రజాసంపదను దోచుకునే పథకమని పలువురు పరిశ్రమ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం వెనుక “వేల కోట్లు దండుకునే పెద్దల ప్లాన్‌ ఉంద’’ని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *