బెట్టింగ్ యాప్‌లు, ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ కేసులో అరెస్టైన ఐబోమ్మ రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అరెస్ట్ చేసిన 90 రోజులు గడిచినా చార్జ్‌షీట్ దాఖలు కాకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
రవికి సంబంధించిన బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ కె. సృజన పలు షరతులు విధించారు. చార్జ్‌షీట్ దాఖలు అయ్యే వరకు ప్రతిరోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య సంబంధిత పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని ఆదేశించారు. పాస్‌పోర్ట్ కోర్టుకు సమర్పించాలి, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేశారు.
అలాగే నివాస చిరునామా, ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు, డిజిటల్ పరికరాల వివరాలను దర్యాప్తు అధికారులకు ఇవ్వాలని, మార్పులు జరిగితే వెంటనే తెలియజేయాలని సూచించారు. ఇంటర్నెట్ వినియోగంపై కూడా పరిమితులు విధించారు.
ఇక ఈ కేసులో ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం డేటా భద్రత. రవి ప్రమోట్ చేసిన యాప్‌ల ద్వారా లక్షలాది మంది యూజర్ల సమాచారం బయటకు వెళ్లిందనే ఆరోపణలు ఉన్నాయి. సుమారు 50 లక్షల మంది వ్యక్తిగత డేటా ప్రమాదంలో పడిందని వార్తలు రావడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది.
ఆ డేటా ఎవరికి వెళ్లింది? ఏ సమాచారాన్ని సేకరించారు? దాన్ని ఎలా వినియోగించారు? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. బెయిల్ మంజూరు అయినా, డేటా లీక్ అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.

