సభా సాంప్రదాయాలు, అధ్యక్ష గౌరవ మర్యాదలు, రాజకీయ భాషపై తెలంగాణ శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే శ్రీ జాఫర్ హుసేన్. రాజకీయ నాయకులందరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ విమర్శలు, సద్విమర్శలు చేయాలని, కానీ భాషను దిగజార్చే విధంగా మాట్లాడడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు.
సభా వేదికగా మాట్లాడుతూ జాఫర్ హుసేన్, “మనం అందరం రాజకీయ నాయకులమే. ఎవరైనా ఎదుటి వారిని గౌరవిస్తూ విమర్శలు చేయాలి. కానీ మాటల స్థాయిని దిగజార్చడం రాజకీయ లక్షణం కాదు, అది అవలక్షణం” అని వ్యాఖ్యానించారు.
ఈ అసెంబ్లీలో కొత్తగా వచ్చిన తమలాంటి 57 మంది సభ్యులు సీనియర్ నాయకులను చూసి నేర్చుకోవాల్సి ఉందని అన్నారు. కానీ కొంతమంది నేతలు మాట్లాడే భాష వల్ల మరింత దిగజారిన పదాలు రాజకీయంలోకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. “ఒకరు తప్పు చేస్తే సద్విమర్శ చేసి సరైన మార్గంలో పెట్టాలి తప్ప, ఇంకొకరు రెండు మూడు మాటలు ఎక్కువగా మాట్లాడితే ప్రజల్లో పేరు వస్తుందని అనుకోవడం సరికాదు” అని ఆయన అన్నారు.
మీడియా ముందు రాజకీయ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడడం వల్ల చివరికి మీడియా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వారిని సింగులర్ పదాలతో సంబోధించే పరిస్థితి వచ్చిందని జాఫర్ హుసేన్ తెలిపారు. దీనికి కారణం రాజకీయ నాయకులే అని స్పష్టం చేశారు.
“బూతులు మాట్లాడడమే రాజకీయమని అనుకుంటే అది రాజకీయ లక్షణం కాదు, రాజకీయ అవలక్షణం” అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. చంద్రశేఖర్ రావు నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కొత్తగా ఎన్నికైన సభ్యులు అందరూ కలిసి భవిష్యత్ శాసనసభ సభ్యులకు మంచి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
హైదరాబాద్‌ను వరల్డ్ క్లాస్ నగరమని చెప్పుకుంటున్నామని, కానీ రాజకీయ నాయకుల మాటలు మాత్రం థర్డ్ క్లాస్ స్థాయికి పడిపోతున్నాయని విమర్శించారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని, అందుకే సభా అధ్యక్షులు ఈ విషయాన్ని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉందని కోరారు.
రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకోవాలంటే మంచి భాష, మంచి సంప్రదాయాలు అవసరమని జాఫర్ హుసేన్ పిలుపునిచ్చారు.

