జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాల తరువాత రాజకీయ விமర్శలు, విశ్లేషణలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఈ విజయంలో నిజమైన పాత్ర ఎవరిది అన్న చర్చ ప్రస్తుతం తీవ్రమైంది. రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నప్పటికీ, అసలు విజయం మాత్రం గ్రౌండ్‌లో కష్టపడిన నాయకులదేనన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలు మొదటి నుంచే ప్రాంతంలో శ్రమిస్తూ, ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. వారి కృషికి తోడు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వేసిన వ్యూహం కూడా గెలుపులో కీలక పాత్ర పోషించిందని అంటున్నారు. అభ్యర్థి నవీన్ యాదవ్ స్వయంగా, ఆయన తల్లి–భార్య కలిసి చేసిన పూజలు, సామాజిక సేవలు, నిత్యం గ్రౌండ్‌లో తిరగడం—ఇవి ప్రజల్లో మంచి ఇంపాక్ట్ చూపించాయి.
అదేవిధంగా ఎంఐఎం ఇచ్చిన మద్దతు కూడా కాంగ్రెస్ ఓట్లను క్రమపరిచేందుకు సహాయపడింది. ముఖ్యంగా చివరి రెండు రోజులలో మంత్రులు, నేతలు ఒక్కసారిగా ఐకమత్యంతో పని చేయడం విజయం సాధించడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
మరోవైపు, బిఆర్ఎస్ మాత్రం పోలింగ్ మేనేజ్‌మెంట్‌లో పూర్తిగా ఫెయిల్ అయినట్టు కనిపిస్తోంది. రెండు రోజుల ముందు నుంచే డబ్బులు ఖర్చు పెట్టడంలో ఇబ్బంది, క్యాడర్ మధ్య నిరుత్సాహం, ప్యానిక్—ఇవి బిఆర్ఎస్‌కు పెద్ద నష్టం చేశాయని విశ్లేషకులు చెబుతున్నారు.
అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి — ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలు ఆలస్యం — కారణంగా నవీన్ యాదవ్ కుటుంబం, క్యాంపు టెన్షన్‌కు గురైనట్లు తెలిసింది. అయినప్పటికీ, చివరి నిమిషంలో జరిగిన రాజకీయ సమన్వయం వాళ్లకు భారీగా మేలు చేసింది.
ఎంఐఎం అసంతృప్తి, అజరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలా లేదా అనే అంతర్గత చర్చలు కూడా ఓటింగ్ ధోరణిపై ప్రభావం చూపించే అవకాశం ఉందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అయినప్పటికీ, చివరి మూడు రోజులలో నేతలందరూ కలిసి పనిచేయడం వల్లే ఓట్లు క్రమపడ్డాయని ప్రచారం.
మొత్తం మీద, ఈ గెలుపు రేవంత్ రెడ్డి స్ట్రాటజీ కాదు… కాంగ్రెస్ కార్యకర్తలు, మీనాక్షి నటరాజన్ వ్యూహం, ఎంఐఎం మద్దతు, నవీన్ యాదవ్ కుటుంబ శ్రమ—ఇవి కలిసివచ్చి తెచ్చిన ఫలితమని గ్రౌండ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

