జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కాంగ్రెస్ దృష్టి – మంత్రులే ప్రచార బాధ్యతలు చేపట్టారు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ, పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ మరింతగా దృష్టి సారిస్తోంది. ఇప్పటివరకు ముగ్గురు మంత్రులే ఈ ఉపఎన్నిక పర్యవేక్షణలో ఉండగా, ఇప్పుడు మొత్తం కేబినెట్‌ను రంగంలోకి దించాలని నిర్ణయించింది.

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గంలోని ఏడు డివిజన్లకు గాను ఒక్కో డివిజన్‌కు ఇద్దరు మంత్రుల చొప్పున బాధ్యతలు అప్పగించారు. ప్రతి మంత్రికి తమ పరిధిలో ప్రచారం చేయడమే కాకుండా, స్థానిక సమస్యలపై ప్రజలకు భరోసా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

యూసుఫ్‌గూడా డివిజన్‌కు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, రమత్‌నగర్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వెంగలరావునగర్‌కు తుమ్మల నాగేశ్వరరావు, వాకిడి శ్రీహరి, సోమాజిగూడాకు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, షేక్‌పేట్‌కు కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి, ఎర్రగడ్డకు దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, బోరబండ డివిజన్‌కు సీతక్క, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి బాధ్యతలు చేపట్టారు.

కాంగ్రెస్ నాయకత్వం ఈ ఉపఎన్నికను కీలకంగా చూస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ, “జూబ్లీహిల్స్ గెలుపు పార్టీకి ప్రతిష్టాత్మకమైనది. ఇది వచ్చే సార్వత్రిక ఎన్నికలకు దారితీసే నిర్ణాయక అడుగు” అని పేర్కొన్నారు.

అయితే, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారం వివాదాస్పదమవుతోంది. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలకు దారితీశాయి. ప్రతిపక్షాలు ఆయనను “రౌడీ షీటర్ లా మాట్లాడుతున్నారని” విమర్శిస్తున్నాయి. నిన్న జరిగిన సభలో ఆయన చేసిన “మీ గల్లీ దాటి బయటికి పోలేరు, మీ శవాలు ఇంటికి వెళ్లవు” వంటి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

ప్రజలు ఈ సారి అభ్యర్థుల వ్యక్తిత్వం, ప్రవర్తన, హామీలను పరిగణనలోకి తీసుకొని ఓటు వేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *