జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కొత్త మలుపు వచ్చింది. నిరుద్యోగులు స్వయంగా బరిలోకి దిగుతూ తమ ఆవేదనను ప్రజా వేదికగా మార్చుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ హామీలను నిలబెట్టుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
నిరుద్యోగుల ప్రతినిధి మాట్లాడుతూ – “కాంగ్రెస్ పార్టీని నమ్మి నిరుద్యోగులు బస్ యాత్రలు చేశారు, ఇంటింటికీ వెళ్లి ఓట్లు వేయించారు. కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించింది. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒకటిన్నర నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు. పోలీస్, గ్రూప్స్, టీచర్ నియామకాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు” అని అన్నారు.
అలాగే ప్రభుత్వం తీసుకొచ్చిన 46, 29, 108, 81 జీవోలు నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నాయని పేర్కొన్నారు. “ఈ జీవోలు రద్దు చేసి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని మా డిమాండ్. కానీ కాంగ్రెస్ నాయకులు దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు” అని నిరసన తెలిపారు.
తమ నిరసనను మరింత బలంగా వినిపించడానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బరిలోకి దిగుతున్నామని ప్రకటించారు. “మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగుల సమస్యలపై సున్నా శ్రద్ధ చూపిన ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాం. జూబ్లీహిల్స్‌లో మా పోరాటం ప్రారంభం అవుతుంది” అని తెలిపారు.
నిరుద్యోగుల ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
“వర్దిల్లాలి – నిరుద్యోగుల స్వరమే మా అజెండా” అని స్పష్టం చేశారు.

