తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టేలా బీఆర్ఎస్ నేత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఇంతకాలం బయట పెడితే తెలంగాణ సిగ్గుపోతుందనే ఊరుకున్నా. ఇప్పటివరకు టాస్ మాత్రమే వేశాను. అసలైన టెస్ట్ మ్యాచ్ ఇంకా ముందుంది” అంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలను ఉద్దేశించి ఘాటైన హెచ్చరికలు చేశారు.
శుక్రవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత.. తన భర్తపై నిరాధార ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం సాగిస్తే తీవ్రంగా ప్రతిస్పందిస్తానని అన్నారు. ఇంటి అల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేయడం వంటి ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన ఆరోపణలను వాస్తవాలు తెలుసుకోకుండా ప్రసారం చేసిన టీ న్యూస్ ఛానల్‌కు లీగల్ నోటీసులు పంపుతున్నట్లు ప్రకటించారు. వారం రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అలాగే బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావులకు కూడా లీగల్ నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు. 2010/2, 2010/3 సర్వే నెంబర్లకు సంబంధించిన భూమి 1975 నుంచే పట్టాలు ఉన్న ప్రైవేట్ భూమి అని స్పష్టం చేశారు. ఆ భూమి వివాదం 2019లో లోక్ అదాలత్‌లో పరిష్కారమైందని, ఆ తర్వాత తమ కుటుంబానికి ఆ భూమితో ఎలాంటి సంబంధం లేదని వివరించారు.
బీఆర్ఎస్ పాలనలో పదేళ్ల పాటు తన భర్తపై ఎలాంటి ఆరోపణలు రాలేదని, ఇప్పుడు అక్రమాల చిట్టా బయటపడుతుందనే భయంతో లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని కవిత మండిపడ్డారు. ఉద్యమ కాలంలో తాము ప్రజల నుంచి వసూళ్లు చేయలేదని, తన నగలు కుదువ పెట్టి బతుకమ్మ సంబరాలు నిర్వహించానని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు చేసిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. “అన్నీ బయటపెడతా, అందరిని జైలుకు పంపుతా అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఎందుకంటే బీఆర్ఎస్ వ్యాపార లావాదేవీలతో ఆయనకు కూడా లింకులు ఉన్నాయ”ని కవిత ఆరోపించారు.
ఇప్పటికీ తాను మొత్తం నిజాలను బయటపెట్టలేదని, సరైన సమయం వచ్చినప్పుడు అక్రమాల చిట్టా మొత్తం ప్రజల ముందు ఉంచుతానని కవిత స్పష్టం చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై కవిత చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.

