వ్యక్తిగా వెళ్తున్నా.. శక్తిగా తిరిగొస్తా: బిఆర్ఎస్‌పై నిప్పులు చెరిగిన కవిత, కొత్త పార్టీ సంకేతాలు?

బిఆర్ఎస్ నుంచి ఘోరమైన అవమానాలు ఎదురయ్యాయని, అవినీతిపై ప్రశ్నించినందుకే తనపై కక్ష కట్టి పార్టీ నుంచి బయటకు పంపారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. బిఆర్ఎస్ తనను సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆ పార్టీ ద్వారా లభించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

సోమవారం తెలంగాణ శాసన మండలి వేదికగా భావోద్వేగంగా మాట్లాడిన కవిత, “వ్యక్తిగానే ఈ సభ నుంచి వెళ్తున్నాను.. కానీ భవిష్యత్తులో ఒక శక్తిగా తప్పకుండా తిరిగి వస్తాను” అంటూ స్పష్టం చేశారు. నైతికత లేని పార్టీ నుంచి బయటకు వస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. టిఆర్ఎస్‌ను బిఆర్ఎస్‌గా మార్చడాన్ని తాను అప్పట్లోనే వ్యతిరేకించానని గుర్తు చేశారు.

2014 నుంచే పార్టీలో తనపై, ఉద్యమకారులపై ఆంక్షలు విధించారని, మహిళల సమస్యలు, అవినీతి అంశాలపై మాట్లాడితేనే అణచివేత మొదలైందని విమర్శించారు. “ఇది ఆస్తుల పంచాయితీ కాదు.. నా ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటం” అంటూ తన రాజీనామాను ఆమోదించాలని సభను కోరారు.

ఈ పరిణామాల మధ్య కవిత త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. ఉగాది నాటికి కొత్త పార్టీ ఆవిర్భావం ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ జాగృతిని ‘భారత జాగృతి’గా మార్చడం వెనుక రాజకీయ వ్యూహమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే కవితపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో మహిళలపై జరిగిన అన్యాయాలపై అప్పట్లో ఎందుకు మౌనం పాటించారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జెడ్పిటీసీలు, మహిళా నాయకుల వేధింపులు, అత్యాచార ఘటనల సమయంలో ఎందుకు స్పందించలేదని నెటిజన్లు నిలదీస్తున్నారు.

అలాగే లిక్కర్ స్కామ్, భూముల అన్యాక్రాంతం, రియల్ ఎస్టేట్ లావాదేవీలు, కుటుంబ ఆస్తుల అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. “ప్రజల నమ్మకం పొందాలంటే వాస్తవాలను సాక్ష్యాలతో బయట పెట్టాలి” అనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.

మొత్తానికి కవిత రాజీనామా తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఆమె నిజంగా కొత్త రాజకీయ శక్తిగా ఎదుగుతారా? లేక ఇది మరో రాజకీయ వ్యూహమా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *