కేసీఆర్ అయిపోయిన చరిత్రేనా? కృష్ణాజలాలు, విభజన హామీలపై రేవంత్ రెడ్డికి స్ట్రెయిట్ ప్రశ్నలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టించే వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి. కేసీఆర్‌ను “అయిపోయిన చరిత్ర”గా అభివర్ణిస్తూ, ఆయన పదేళ్ల పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను గుర్తు చేస్తూ తీవ్ర విమర్శలు వినిపించాయి. ఉద్యమకారులను పక్కన పెట్టడం, కృష్ణాజలాల వాటా తేల్చలేకపోవడం, జగన్‌తో కలిసి రాజకీయ లాభాల కోసం వ్యవహరించారన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి.

కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం పోయిందని, అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను గద్దె దించారని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారంటీలపై నమ్మకంతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన ప్రజలు ఇప్పుడు ఫలితాలు ఆశిస్తున్నారని తెలిపారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గత పాలకుల తప్పులనే చూపిస్తూ కాలం గడుపుతోందని విమర్శించారు.

ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో సాన్నిహిత్యం పెంచుకుంటూ తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టారా? అనే ప్రశ్నలు సంధించారు. కృష్ణాజలాల అంశం, విభజన హామీల అమలు విషయంలో స్పష్టమైన చర్యలు ఎక్కడున్నాయని నిలదీశారు. “ఇంకా వాళ్లు చేసారు, వీళ్లు చేసారు అని చెప్పే కాలం అయిపోయింది. ఇప్పుడు చేయాల్సింది మీరు” అని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అసెంబ్లీకి కేసీఆర్ రావడంపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. ఫామ్ హౌస్‌కే పరిమితమైన నాయకత్వం ప్రజా సమస్యలపై ఎలా పోరాడుతుందని ప్రశ్నించారు. నిజంగా కృష్ణాజలాలపై చర్చ జరిగితే ప్రజలే స్పందిస్తారని, కానీ మాటలకే పరిమితం అయితే నమ్మకం ఉండదని అన్నారు.

చివరగా, తెలంగాణ అస్తిత్వం, హక్కులు, నీటి వాటాల కోసం ప్రభుత్వం నేరుగా పోరాడాలని, కేంద్రం – పొరుగు రాష్ట్రాల ముందు తలవంచకుండా తెలంగాణకు రావాల్సినవి తీసుకురావాలని డిమాండ్ చేశారు. “తెలంగాణ ప్రజల కోసం నిజంగా ఆలోచించిన రోజే ప్రజలు కూడా మీ కోసం ఆలోచిస్తారు” అంటూ హెచ్చరికలతో కూడిన సందేశం ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *