ఫోన్ టాపింగ్ కేసులో ఆదివారం సిట్ విచారణ ఉండటంతో ఉదయం 11 గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా నందీనగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ ముఖ్యనేతలతో కలిసి లంచ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనపై నమోదైన కేసులు, సిట్ విచారణ తీరు, భవిష్యత్ వ్యూహాలపై పార్టీ నేతలతో ఆయన చర్చించినట్లు సమాచారం.
సిట్ విచారణ అనంతరం కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పాటు బీఆర్ఎస్ న్యాయవాద బృందంతో కేసీఆర్ సమావేశమయ్యారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలు, వాటికి తాను ఇచ్చిన సమాధానాలను ఆయన నేతలతో పంచుకున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై కూడా లీగల్ టీంతో సమాలోచనలు జరిగినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్‌కు చెందిన కెమెరామన్‌పై జరిగిన దాడిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీపై కోపం ఉంటే మీడియా ఫీల్డ్ సిబ్బందిపై దాడులు చేయడం తగదని పలువురు అభిప్రాయపడుతున్నారు. జర్నలిస్టులు, కెమెరామన్లపై దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫోన్ టాపింగ్ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలో రిటైర్డ్ అధికారుల సేవలను కొనసాగించిన విషయంలో కేసీఆర్‌ను తప్పుబట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం అదే విధానాన్ని అమలు చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “మార్పు” నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, పాత విధానాలనే కొనసాగిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.
సిట్ అధికారులు కేసీఆర్‌ను ప్రశ్నించినప్పటికీ, అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని సమాచారం. సుమారు ఐదు గంటల పాటు సాగిన విచారణలో దాదాపు 60 ప్రశ్నలు అడిగినట్లు టాక్. కేసీఆర్ పూర్తిగా సహకరించారని, ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చారని కేటీఆర్ వెల్లడించారు.
విచారణ అనంతరం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు తిరిగి వెళ్లారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టగా, తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఫోన్ టాపింగ్ అంశం రాజకీయంగా మరింత వేడెక్కుతున్న నేపథ్యంలో, ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

