తెలంగాణ రాజకీయాల్లో రెండు ముఖ్య పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసాయి. ఒకవైపు బీసీ 42% రిజర్వేషన్ అంశంపై ఉద్రిక్తతలు పెరుగుతుండగా, మరోవైపు ఫార్ములా E కార్ రేస్ ఫండ్స్ దుర్వినియోగం కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
కేటీఆర్ విచారణకు గ్రీన్ సిగ్నల్ – ఏసీబీ సన్నద్ధం
ఫార్ములా E కార్ రేస్ నిర్వహణలో చోటుచేసుకున్న ఫండ్ మిస్యూస్, నిర్ణయాల దుర్వినియోగంపై విచారణ కోరుతూ ఏసీబీ నుంచి వచ్చిన లేఖకు గవర్నర్ ఆమోదం తెలిపినట్టు సమాచారం.
ఇప్పటికే ఏసీబీ పలుమార్లు కేటీఆర్‌ను ప్రశ్నించింది. ఇప్పుడు విచారణకు పూర్తి అనుమతి రావడంతో చార్జీషీట్ దాఖలు దిశగా అధికారులు అడుగులు వేయనున్నట్టు తెలుస్తోంది.
వివాదాస్పద అంశాలు:
- కేబినెట్ ఆమోదం లేకుండా నేరుగా నిధుల మార్పిడి జరిగిందన్న ఆరోపణ
- కీలక నిర్ణయాలు మంత్రి హోదాలో కేటీఆర్ స్వయంగా ఇచ్చారన్న అధికారుల వాంగ్మూలాలు
- ప్రజా ధనం వృథా అయ్యిందన్న అభియోగాలు
ప్రస్తుత పరిస్థితుల్లో కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం “నిజమైన అరెస్ట్ అవకాశాలు చాలా తక్కువ… రాజకీయ మబ్బింగ్, ఎన్నికల రణరంగంలో మానసిక ఒత్తిడి సృష్టించే ప్రయత్నమే ఎక్కువగా కనిపిస్తోంది” అంటున్నారు.
కాంగ్రెస్–బిజెపి–బిఆర్ఎస్ ఒకరినొకరు నిందించుకుంటూ
- బిఆర్ఎస్: “ఇది కాంగ్రెస్–బిజెపి కుట్ర”
- కాంగ్రెస్: “చట్ట ప్రకారం చర్యలు మాత్రమే… కక్ష కాదు”
- బిజెపి: “ఏసీబీకి ఇవ్వాలంటే ముందే చెప్పాం… ఇప్పుడే ఎందుకు డిలే?”
ఇదిలా ఉండగా, మొత్తం వ్యవహారం ఎన్నికల ముందు రాజకీయ ఆయుధంగా మారినట్టే కనిపిస్తోంది.
బీసీ 42% రిజర్వేషన్‌పై మరో పెద్ద వాదన
ఇక మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై పెద్ద చర్చ కొనసాగుతోంది.
బీసీ సంఘాల డిమాండ్:
- పార్టీ నిర్ణయాలు వద్దు
- చట్టబద్ధంగా G.O. ద్వారా 42% రిజర్వేషన్ ఇవ్వాలి
- కోర్టులో నిలబడగల లీగల్ ఫ్రేమ్ కావాలి
ఈసీ ఇప్పటికే మూడు విడతల పంచాయతీరాజ్ ఎన్నికలకు షెడ్యూల్ సన్నాహాలు చేస్తుండగా, రిజర్వేషన్లపై స్పష్టత రావాల్సి ఉంది.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం
కొంతమంది విశ్లేషకుల మాటల్లో:
“ప్రతి ఎన్నికల ముందు కేటీఆర్ అరెస్ట్ డ్రామా వస్తుంది… రెండు సంవత్సరాల నుంచి ఇదే చర్చ. నిజంగా అవినీతి ప్రూవ్ అయితే వెంటనే అరెస్ట్ చేసేవారు. ఇప్పుడు తిరిగి ఈ అంశం ఎలక్షన్ స్ట్రాటజీలా కనిపిస్తోంది.”
అదే సమయంలో బీసీ రిజర్వేషన్ కూడా ఎన్నికల రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న అంశంగా మారింది.

