కర్నూల్ వాల్వో బస్ దుర్ఘటన – అక్రమ స్లీపర్ బస్సులపై తెలంగాణ ప్రభుత్వం సోదాలు ప్రారంభం

కర్నూలు జిల్లా చినటేకూరు వద్ద చోటుచేసుకున్న వాల్వో బస్సు ప్రమాదం దేశవ్యాప్తంగా మరోసారి ప్రైవేట్ ట్రావెల్స్‌ వ్యవస్థలోని అక్రమాలను బహిర్గతం చేసింది. పాలెం నుంచి చినటేకూరు వైపు వస్తున్న వాల్వో స్లీపర్ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 19 మంది సజీవదహనమై, మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఆ బస్సుకు అధికారికంగా కేవలం 43 సీట్లు మాత్రమే అనుమతి ఉండగా, దాన్ని అక్రమంగా స్లీపర్ బస్సుగా మార్చి నడిపినట్లు అధికారులు నిర్ధారించారు. ఆ బస్సు ఒడిశా రాష్ట్రంలోని రాయగడలో రిజిస్ట్రేషన్ అయి ఉండగా, ఫిట్నెస్ సర్టిఫికేట్ AIS-119 భద్రతా నిబంధనలకు విరుద్ధంగా జారీ చేయబడిందని సమాచారం.

ఈ ఘటనలో కావేరి ట్రావెల్స్ మళ్లీ వివాదాస్పదంగా మారింది. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అధిక పన్నులు తప్పించుకోవడానికి ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకొని అక్రమ అనుమతులతో బస్సులు నడిపిస్తోందని ఆరోపణలు ఉన్నాయి

ఈ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో తనికీలు ప్రారంభించింది. ఆర్టీఏ అధికారులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇవి సీటర్ బస్సులను అక్రమంగా స్లీపర్‌లుగా మార్చిన వాహనాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నాయి. ఈ సోదాలు రెండు నుండి మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రమాదంపై హై లెవల్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ₹5 లక్షల ఎక్స్గ్రేషియా, ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి ₹2 లక్షలు, గాయపడిన వారికి ₹50 వేల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది. అయితే, ఈ పరిహారం తక్కువగానే ఉందని ప్రజలు, కార్యకర్తలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఇక ఆర్టీఓ శాఖ నిర్లక్ష్యం ఈ ఘటనలో ప్రధాన కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒడిశాలో రిజిస్ట్రేషన్ చేసిన బస్సులకు తెలంగాణలో అనుమతులు ఎలా లభించాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొంతమంది అధికారుల అవినీతి, బ్రోకర్ల ప్రమేయం, అంతర్గత లాబీయింగ్ వంటి అంశాలు కూడా బయటకొస్తున్నాయి.

రాజకీయ వర్గాలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాయి. కావేరి ట్రావెల్స్, ఆరెంజ్ ట్రావెల్స్, కృష్ణవేణి ట్రావెల్స్ వంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పాత బస్సులను స్లీపర్‌లుగా మారుస్తూ, పొల్యూషన్ నియమాలను ఉల్లంఘిస్తూ నడుపుతున్న బస్సులను కూడా తనికీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

కర్నూల్ బస్సు ప్రమాదం మరోసారి భద్రతా ప్రమాణాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి ఎంత ప్రాణాంతకమో గుర్తు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *