ఫిబ్రవరి 12న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించవద్దు: రాష్ట్ర ఎన్నికల సంఘానికి కార్మిక సంఘాల వినతి

రాష్ట్రంలో ఫిబ్రవరి 12న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించవద్దని పలు కార్మిక సంఘాలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, జాతీయ విత్తన బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అదే రోజున దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సర్వసాధారణ సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12న ఎన్నికలు నిర్వహిస్తే కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడుతుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మీడియాలో ఫిబ్రవరి 12న మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న ప్రచారాలు రావడంతో, వాటిని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లినట్లు సంఘాల నేతలు తెలిపారు.

శుక్రవారం మాసబ్ ట్యాంక్‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని కార్మిక సంఘాల నాయకులు కలసి వినతిపత్రం సమర్పించారు. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, బీఆర్టీయూ, టీయూసీఐ, ఐఎఫ్‌టీయూ వంటి పలు ప్రధాన కార్మిక సంఘాల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు.

సర్వసాధారణ సమ్మెకు కార్మిక వర్గాల నుంచి విస్తృత మద్దతు ఉన్న నేపథ్యంలో, అదే రోజున ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకంగా మారుతుందని నేతలు స్పష్టం చేశారు. కాబట్టి కార్మికుల సమ్మెను దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ ఎన్నికల తేదీలను పునర్విమర్శించాలని వారు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో రాజకీయ వర్గాలు, కార్మిక సంఘాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *