మహాలక్ష్మి పథకంలో గురుజ్యోతి అమలు: 200 యూనిట్ల ఉచిత కరెంట్‌తో 52.82 లక్షల కుటుంబాలకు ఊరట

మహాలక్ష్మి పథకంలో భాగంగా గురుజ్యోతి పథకం: 200 యూనిట్ల ఉచిత కరెంట్‌తో లక్షల కుటుంబాలకు భారీ ఊరట

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం తెలిపారు. నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిచ్చేలా 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ ఇస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభుత్వం నిజం చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తున్న గురుజ్యోతి పథకం కేవలం మహిళలకే కాకుండా, కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి ఆ కుటుంబంలోని ప్రతి సభ్యుడికి లబ్ది చేకూరేలా రూపొందించామని తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలు, కుటుంబ సభ్యులంతా ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని పొందుతున్నారని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్‌పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలో జిల్లాల వారిగా ఈ పథకాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. టీజీఎస్‌పీడీసీఎల్ పరిధిలో 25,03,560 కుటుంబాలు 200 యూనిట్ల లోపు వినియోగించే విద్యుత్‌కు సంబంధించిన బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేకుండా, వాటి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా చెల్లిస్తోందని వెల్లడించారు.

అదే విధంగా ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్న జిల్లాల్లో 27,46,938 కుటుంబాలకు కూడా 200 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోందని తెలిపారు. ఈ విధంగా మొత్తం రాష్ట్రంలో 52,82,498 కుటుంబాలకు ఉచిత కరెంట్ అందిస్తూ, వారు చెల్లించాల్సిన బిల్లులను ప్రభుత్వం నేరుగా విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నట్లు చెప్పారు.

ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 2025 డిసెంబర్ వరకు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందుతున్న లబ్ధిదారుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు మొత్తం రూ.3,593 కోట్లను చెల్లించిందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. అర్హులైన మహిళా దరఖాస్తుదారులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేసినట్లు ఆయన తెలిపారు.

ఈ విధంగా వేల కోట్ల రూపాయల భారం నుంచి కుటుంబాలను విముక్తం చేయడం వల్ల ఆ డబ్బు పిల్లల చదువు, కుటుంబ అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వానికి ఉపయోగపడుతోందని చెప్పారు. ప్రజల పక్షాన ఇచ్చిన హామీలకు కట్టుబడి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని పేర్కొన్నారు.

ఇప్పటివరకే కాదు, భవిష్యత్తులో కూడా 200 యూనిట్ల ఉచిత కరెంట్ పథకాన్ని కొనసాగిస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. పేదలు, బడుగు-బలహీన వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకొని, ఆత్మగౌరవంతో జీవించేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం నిత్యం తపిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *