మేడారం మహాజాతర ప్రారంభం: గద్దెలపైకి సారలమ్మలు, రేపు సమ్మక్క రాక

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ఖ్యాతిగాంచిన మేడారం మహాజాతర నేడు ఘనంగా ప్రారంభం కానుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు మేడారం వైపు తరలివస్తున్నారు.

నేడు సాయంత్రం 6 గంటలకు కన్నేపల్లి నుంచి సారలమ్మను, కొండాయి నుంచి గోవిందరాజును, పోనిగొండ్ల నుంచి పగిడిదరాజును పూజారులు గద్దెలపైకి తీసుకురానున్నారు. ఈ ఘట్టంతో మహాజాతర అధికారికంగా ప్రారంభమవుతుంది. పోనిగొండ్ల ప్రాంతం పెళ్లి వాతావరణాన్ని సంతరించుకుని అంగరంగ వైభవంగా పరిణయ ఘట్టాన్ని తలపిస్తోంది.

రేపు సాయంత్రం 6 గంటలకు చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని గద్దెపైకి తీసుకురానున్నారు. సమ్మక్క రాకతో మొక్కులు, ప్రత్యేక పూజలు మొదలవుతాయి. అమ్మవారుల వనప్రవేశం 31వ తేదీ సాయంత్రం 4 గంటలకు జరగనుంది.

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా వచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, వైద్య సేవలు, రవాణా, భద్రత వంటి ఏర్పాట్లను ప్రభుత్వం విస్తృతంగా చేసింది.

మేడారం మహాజాతర సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ జాతర గిరిజన సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *