తెలంగాణ ప్రజలే తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేస్తూ, హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలకమైన మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి నైట్ ఎకానమీ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో హోటళ్లు, ఆఫీసులు, ఫుడ్ కోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలతో కూడిన నైట్ ఎకానమీని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న పేదలకు నష్టం కలగకుండా అత్యధిక పరిహారం, ఆధునిక కాలనీలు, మెరుగైన వసతులు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దోమలు, దుర్వాసన, కాలుష్యం మధ్య జీవనం సాగిస్తున్న నిరుపేదలు ఇష్టపడి అక్కడ నివసించడం లేదని, ప్రత్యామ్నాయం లేకపోవడంతోనే మూసీ తీరాన ఇళ్లు వేసుకున్నారని ప్రభుత్వం పేర్కొంది.
మూసీ నది శుద్ధి, అభివృద్ధి ప్రాజెక్ట్‌ను అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్ సంస్థల సహకారంతో విడతలవారీగా అమలు చేయనున్నారు. మొదటి దశ ప్రాజెక్ట్ ఒక కొలిక్కి వచ్చిందని, పూర్తి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధం కావడానికి మరో ఏడాది సమయం పడుతుందని వెల్లడించారు. DPR పూర్తయ్యాక బడ్జెట్ సమావేశాల్లో సభ ముందుంచి పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.
ప్రాజెక్ట్‌లో భాగంగా మూసీ–ఈసా–గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం, శాశ్వత నీటి ప్రవాహం, కాలుష్య నియంత్రణ కోసం ఆధునిక సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే మూసీ పరివాహక ప్రాంతంలో మత సామరస్యానికి ప్రతీకగా దేవాలయం, మసీదు, గురుద్వారా, చర్చిల నిర్మాణం ద్వారా ఒక ప్రత్యేక మత సమ్మేళనాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
మంచిరేవుల వద్ద కాకతీయుల నాటి పురాతన శివాలయం పునరుద్ధరణ, గౌలిగూడలో సిక్ మందిరం, ఉప్పల్ ప్రాంతంలో చర్చి, మక్కా మసీదు సమీపంలో అంతర్జాతీయ స్థాయి మసీదు నిర్మాణం వంటి ప్రణాళికలు కూడా ప్రాజెక్ట్‌లో భాగమని వెల్లడించారు. అదేవిధంగా గాంధీ సరోవర్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని డిఫెన్స్ భూమిని తెలంగాణకు బదలాయించే ప్రక్రియ కూడా ముందుకు సాగుతోందని తెలిపారు.
ప్రాజెక్ట్ అమలులో ఎలాంటి రహస్యాలు లేవని, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సూచనలకు ప్రభుత్వం పూర్తిగా ఓపెన్‌గా ఉందని స్పష్టం చేశారు. విదేశీ నగరాల రివర్‌ఫ్రంట్ అభివృద్ధిని పరిశీలించి, హైదరాబాద్‌కు సరిపోయే విధంగా మూసీ రివర్ డెవలప్‌మెంట్ చేపడతామని తెలిపారు.
పేదలకు ఇళ్లు, మంచి స్కూళ్లు, ఆసుపత్రులు, నైపుణ్య శిక్షణతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, మూసీ నది శుద్ధి కేవలం అభివృద్ధి ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలుస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

