సినిమా టికెట్ల వివాదంపై సీఎం భేటీకి నిర్మాతలు.. నీటి వివాదాలపై ‘వివాదాలు కాదు.. నీళ్లే కావాలి’ అని రేవంత్ రెడ్డి స్పష్టం

సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణలో సినిమా టికెట్ల ధరల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు, హీరోలు, దర్శకులు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్నారు. సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని, బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలపై విధించిన పరిమితులను సడలించాలని వారు ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సమాచారం.

ప్రధానంగా ‘రాజాసాబ్’ సినిమాకు సంబంధించి తెలంగాణలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలుకు అనుమతి లభించకపోవడం, అలాగే జీఓ నెంబర్ 120 ప్రకారం ఈ అంశంపై కొత్త జీవోలు జారీ చేయరాదని కోర్టు ఆదేశాలు ఇవ్వడమే ఈ భేటీకి ప్రధాన కారణంగా తెలుస్తోంది. సంక్రాంతికి విడుదలవుతున్న చిత్రాల నిర్మాతలు, హీరోలు ఈ భేటీలో తమ వాదనను ముఖ్యమంత్రికి వివరించనున్నారని సినీ వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉండగా, ఏపీ–తెలంగాణ మధ్య నీటి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా రేవంత్ రెడ్డి స్పందిస్తూ, వివాదాలు వద్దని, తమకు నీళ్లే కావాలని స్పష్టం చేశారు.

కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలోనే అనుమతులు వచ్చాయని, వాటికి ఇప్పుడు అడ్డు తగలకపోవాలని ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో, రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టుల చుట్టూ తిరగడం కంటే ఇరు రాష్ట్రాలు కూర్చుని చర్చల ద్వారా శాశ్వత పరిష్కారం కనుగొందామని సూచించారు.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాలలోని టీజేఏసీ ఈసిటీలో సుజన్ మెడికేర్ సంస్థ నూతన తయారీ యూనిట్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, నీటి వివాదాలపై తన వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. “ఎవరైనా నన్ను వివాదాలా? నీళ్లా? అని అడిగితే.. నాకు నీళ్లే కావాలి అంటాను. వివాదాలకన్నా పరిష్కారాలే ముఖ్యం” అని అన్నారు.

పొరుగు రాష్ట్రాలతో వివాదాలు కాకుండా పరస్పర సహకారంతో ముందుకు సాగాలని, ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రతోనూ తెలంగాణకు సమస్యలు అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా ఇరు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇక ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *