మున్సిపల్ ఫలితాల్లో డబ్బు రాజకీయాలు, స్వతంత్రుల ఉధృతి – కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీపై ప్రొఫెసర్ గాలి వినోద్ తీవ్ర విమర్శలు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ప్రొఫెసర్ గాలి వినోద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లైవ్ చర్చలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేసినప్పటికీ, విస్తృతంగా డబ్బులు పంచినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కూలిపోలేదని అన్నారు. కాంగ్రెస్ 80–90 శాతం గెలుస్తామని చెప్పి చివరికి బీఆర్ఎస్ చేతిలో చుక్కలు చూశిందని వ్యాఖ్యానించారు.

ఈ విజయం కేవలం కాంగ్రెస్ పార్టీదే కాదని, ఇది ఐదు ప్రతిపక్షాల సమిష్టి విజయమని అభిప్రాయపడ్డారు. మరోవైపు బీజేపీ కూడా ఐడియాలజీని వదిలేసి కార్పొరేట్ రాజకీయాల వైపు వెళ్లిందని, డబ్బులు పంచే స్థితికి చేరిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలూ డబ్బు, మద్యం మీద ఆధారపడి గెలవాలని చూస్తున్నాయన్నారు.

ఎన్నికల కమిషన్ కబోదిలా మారిపోయిందని, పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా అమ్ముడుపోయిందని గాలి వినోద్ ఆరోపించారు. ఈ ఎన్నికలు న్యాయంగా గెలిచినవి కావని, డబ్బు ప్రభావంతో సాధించిన ఫలితాలేనని వ్యాఖ్యానించారు.

కరీంనగర్, నిజామాబాద్, మెదక్ వంటి ప్రాంతాల్లో బీజేపీ ఎక్కువ ఫోకస్ పెట్టినా, ప్రజలు కనీసం పట్టించుకోలేదన్నారు. మైనారిటీలు, దళితులు, బీసీలు అధికంగా ఉన్న సెక్యులర్ ప్రాంతాల్లో బీజేపీకి గెలిచే అవకాశమే లేదని స్పష్టం చేశారు.

స్వతంత్ర అభ్యర్థుల ఉధృతి ఈ ఎన్నికల ప్రత్యేకతగా నిలిచిందని గాలి వినోద్ చెప్పారు. వడ్డేపల్లి (జోగులాంబ గద్వాల్ జిల్లా)లో స్వతంత్రులు ఎనిమిది స్థానాలు గెలవడంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తు కీలక పాత్ర పోషించిందన్నారు. ఆ గుర్తు వెనుక కవిత ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.

ఇది కేవలం స్వతంత్రుల గెలుపు కాదని, ఇది కవిత రాజకీయ గెలుపుగా చూడాలన్నారు. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్‌ను చీల్చేందుకు కవిత పాత్ర ఉందని, ఈ మొత్తం వ్యవహారం వెనుక రేవంత్ రెడ్డి వ్యూహం కూడా పనిచేస్తోందని వ్యాఖ్యానించారు.

నిర్మల్‌లోని బైంసా మున్సిపాలిటీలో 26 స్థానాల్లో ఇప్పటివరకు ప్రకటించిన 11 స్థానాలన్నింటినీ స్వతంత్రులు గెలవడం రాజకీయాల్లో కొత్త శక్తి అవతరిస్తోందనే సంకేతమని తెలిపారు. హుజూరాబాద్, కోదాడ, జగిత్యాల వంటి ప్రాంతాల్లో కూడా స్వతంత్రుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

ఎన్నికలు పూర్తిగా వ్యాపారంగా మారిపోయాయని, పెట్టుబడి పెట్టి లాభాలు పొందే వ్యవస్థగా రాజకీయాలు దిగజారాయని గాలి వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన కూడా చేయలేని పరిస్థితి వచ్చిందన్నారు.

డబ్బుకు అమ్ముడుపోకుండా ప్రజలు మార్పు కోరుకుంటేనే వ్యవస్థ మారుతుందని, డబ్బులతో ఓట్లు కొనేవారిని సమాజం తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ స్వతంత్రుల ఉధృతి 2028 వరకు కొనసాగితే కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమే కాదు, బీజేపీ కూడా అధికారానికి దూరమవుతుందని, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు ఎదుగుతాయని గాలి వినోద్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *