మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి బీసీ (వెనుకబడిన తరగతులు) సామాజిక వర్గాలకే ప్రధాన రాజకీయ పార్టీలు పెద్దపీట వేశాయి. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ కూడా బీసీలకు అత్యధిక సంఖ్యలో సీట్లను కేటాయించాయి. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులపై స్పష్టత వచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం సీట్లలో 53.71 శాతం బీసీలకు కేటాయించింది. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ 53.79 శాతం సీట్లను బీసీలకు ఇచ్చింది. బీజేపీ మాత్రం కొంత తక్కువగా 49.89 శాతం సీట్లను బీసీ అభ్యర్థులకు కేటాయించింది. ఈ గణాంకాలు చూస్తే బీసీలకు టికెట్లు ఇవ్వకుండా ఎన్నికల్లో విజయం సాధించడం అసాధ్యమనే స్థాయికి రాజకీయ పరిస్థితి చేరిందని విశ్లేషకులు చెబుతున్నారు.
బీసీల తర్వాత ఎస్సీలకు కాంగ్రెస్ పార్టీ 19 శాతం, బీఆర్ఎస్ 18.66 శాతం, బీజేపీ 15.80 శాతం సీట్లు కేటాయించాయి. ఎస్టీలకు సంబంధించి కాంగ్రెస్, బీఆర్ఎస్ దాదాపు సమానంగా 7.66 శాతం సీట్లు ఇవ్వగా, బీజేపీ 7.5 శాతం సీట్లను కేటాయించింది.
జిల్లాల వారీగా చూస్తే కొన్ని ప్రాంతాల్లో బీసీలకు మరింత ఎక్కువ ప్రాధాన్యం లభించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 67.66 శాతం సీట్లను బీసీ అభ్యర్థులకు కేటాయించింది. అదే జిల్లాలో బీఆర్ఎస్ 60 శాతం, బీజేపీ 61 శాతం సీట్లు బీసీలకు ఇచ్చాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 13 మున్సిపాలిటీల్లో మొత్తం 294 వార్డులు ఉండగా, ఇక్కడ బీఆర్ఎస్ 127 మంది బీసీ అభ్యర్థులను బరిలోకి దింపగా, కాంగ్రెస్ 121 మంది బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది.
కొన్ని మున్సిపాలిటీల్లో బీసీలకు రికార్డు స్థాయిలో సీట్లు కేటాయించడం విశేషంగా మారింది. నిర్మల్ మున్సిపాలిటీలో బీజేపీ ఏకంగా 90 శాతం సీట్లను బీసీలకు కేటాయించగా, బీఆర్ఎస్ 71 శాతం, కాంగ్రెస్ 57 శాతం సీట్లు ఇచ్చాయి. బైన్సా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 46 శాతం, కాంగ్రెస్ 26 శాతం సీట్లు బీసీలకు కేటాయించింది.
ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులు, అలాగే ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో 414 డివిజన్లు కలిపి మొత్తం 2,996 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కంటే ఎక్కువగా అన్ని పార్టీలు సీట్లు కేటాయించడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. జనాభా దామాషా ప్రకారం బీసీలు సుమారు 56 శాతం ఉన్నారనే వాదన బలపడుతుండటంతో, రాబోయే రోజుల్లో 42 శాతం రిజర్వేషన్ నినాదం కాకుండా 56 శాతం రిజర్వేషన్ డిమాండ్ మరింత బలంగా ముందుకు వచ్చే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బీసీ సామాజిక వర్గాల ప్రాధాన్యం స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత స్పష్టంగా కనిపిస్తోందని చెప్పవచ్చు.

