మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నేడో రేపో వెలువడే అవకాశం ఉందని మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. బుధవారం లేదా గురువారం నోటిఫికేషన్ విడుదల కావొచ్చని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం, ఆలేరులో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయన మీడియాతో మాట్లాడారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారం మంగళవారం నుంచే ప్రారంభించామని మంత్రి వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మున్సిపాలిటీల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ప్రగతి బాటలో నిలుపుతామని హామీ ఇచ్చారు. అలాగే బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
బంగారు తెలంగాణ పేరుతో పాలన సాగించిన కాలంలో బాగుపడింది కేసీఆర్ కుటుంబమే తప్ప, సామాన్య ప్రజలు బాగుపడలేదని కోమటరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి ధర్మకర్తల మండలి నియమించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని తెలిపారు.
అయితే ఎన్నికల వేళ ఇంద్రమ్మ చీరలు, వడ్డీ లేని రుణాల పంపిణీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవన్నీ ఎన్నికల ప్రచారంలో భాగమేనా అన్న ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. గతంలో సర్పంచ్ ఎన్నికల ముందు ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేశారని, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ముందు మళ్లీ అదే కార్యక్రమాలు చేపడుతున్నారని మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కొంతమంది మహిళలు బహిరంగంగా “మాకు ఇంద్రమ్మ చీరలు వద్దు, రూ.2500 ఇవ్వాలి” అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.2500 ఆర్థిక సహాయం ఎక్కడ ఉందని నిలదీస్తున్నారు. ఇళ్లు, చీరల కంటే నగదు సహాయం కావాలని కోరుతున్నా, ఆ ప్రశ్నలకు మంత్రులు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ పరిణామాలతో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

