జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రాజకీయ వేడి తీవ్రంగా మారిన సమయంలో, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనంగా ముందంజలో ఉండటం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. సుమారు 12,000 ఓట్ల ఆధిక్యం నమోదు కావడంతో నవీన్ యాదవ్ ఆఫీస్ వద్ద సంబరాలు అల్లరి మయంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాటలు, డ్యాన్సులతో కార్యాలయం మొత్తాన్ని పండుగ మందిరంలా మార్చేశారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ క్యాంపెయిన్ టీమ్‌కు చెందిన కీలక సభ్యులు కూడా ఈ సంబరాల్లో పాల్గొన్నారు. టోటల్ క్యాంపెయిన్‌లో కాంగ్రెస్ బలంగా పనిచేసిందని, మూడు రాష్ట్ర మంత్రులు పాల్గొనడం ప్రత్యేక శక్తినిచ్చిందని వారు పేర్కొన్నారు. బిఆర్ఎస్ సరైన స్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేకపోవడం కాంగ్రెస్‌కు కలిసివచ్చిన అంశమని వారు అభిప్రాయపడ్డారు.
ప్రజలు ఈసారి ఓటు వేసింది కేవలం సానుభూతికి మాత్రమే కాకుండా నవీన్ యాదవ్ వ్యక్తిగత సేవలకు, ప్రాంతీయ అభివృద్ధిపై ఇచ్చిన హామీలకు అని కార్యకర్తలు చెబుతున్నారు.
మూడు సార్లు ఓడిన తర్వాత ఈసారి నవీన్ యాదవ్ సాధించిన ఆధిక్యం కాంగ్రెస్ కార్యకర్తల్లో అదిరిపోయే స్ఫూర్తిని నింపింది.
నవీన్ యాదవ్ స్వగృహంలో కూడా సంబరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు, పెద్దలు, అనుచరులు కలిసి ఈ చారిత్రక విజయాన్ని జరుపుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నుంచి తొలిసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవడం ఇదే.
ప్రజలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి తన వంతు కృషి చేస్తానని నవీన్ యాదవ్ అనుచరులు స్పష్టం చేశారు. ఇప్పటికే 150 కోట్ల వరకు అభివృద్ధి పనులు సాగుతున్నాయని, జూబ్లీ హిల్స్ తెలంగాణలో అభివృద్ధిలో నెంబర్ వన్ నియోజకవర్గంగా మారుతుందని వారు నమ్ముతున్నారు.
టీఆర్ఎస్, బిఆర్ఎస్, బీజేపీ ఏ పార్టీ కూడా ఈసారి ప్రభావం చూపలేకపోయాయని, ఇది పూర్తిగా ప్రజల తీర్పే అని కార్యకర్తలు అంటున్నారు. యూసఫ్‌గూడా సహా మొత్తం ప్రాంతం నవీన్ యాదవ్ విజయోత్సాహంతో మునిగిపోయింది.
జూబ్లీ హిల్స్ నుంచి వచ్చిన ఈ ఫలితం, తెలంగాణలో కాంగ్రెస్ ఆధిపత్యానికి నాంది అని పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వీరి మాటల్లో–
“ఇది నవీన్ యాదవ్ గెలుపు కాదు, తెలంగాణ గెలుపు!”

