స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియపై తీవ్ర గందరగోళం నెలకొంది. నామినేషన్ వేయాలంటే తప్పనిసరిగా హౌస్ టాక్స్ ఎన్ఓసి తీసుకురావాలనే నిబంధన ఎక్కడ ఉందో స్పష్టంగా చూపాలని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
ఇచ్చిన ఫారం, చెక్‌లిస్ట్‌లో ఎక్కడా హౌస్ టాక్స్ చెల్లించాలి లేదా ఎన్ఓసి తీసుకురావాలనే నిబంధన లేదని అభ్యర్థులు అంటున్నారు. అలాంటప్పుడు తమను ఎందుకు చెల్లింపులు చేయమంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదకుల విషయంలో కూడా ఒక్కరు సరిపోతారని బుక్‌లో ఉన్నప్పుడు ఇద్దరు ప్రతిపాదకులు కావాలంటూ ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు.
ఈ అంశంపై కమిషనర్‌ను అడిగినా కేవలం వర్బల్‌గా సమాధానాలు చెప్తున్నారే తప్ప అధికారికంగా ఎలాంటి ఆదేశాలు లేదా నోటిఫికేషన్ ఇవ్వలేదని అభ్యర్థులు ఆరోపించారు. నామినేషన్‌కు ఏఏ పత్రాలు అవసరమో స్పష్టంగా ఒక నోటీస్ బోర్డ్‌లో పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
నిన్నటి నుంచి ఈ గందరగోళం వల్ల అభ్యర్థులు ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హౌస్ టాక్స్ చెల్లించాలి, ఎన్ఓసి తెచ్చుకోవాలనే విషయాలు అధికారికంగా ఎక్కడా లేవని స్పష్టం చేశారు.
ప్రజలను, అభ్యర్థులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత అధికారులదేనని, కానీ ఇలా అయోమయం సృష్టించడం తగదని వారు విజ్ఞప్తి చేశారు. స్పష్టమైన నియమాలు ఉంటే వాటిని రాతపూర్వకంగా చూపించాలని, అప్పుడు అందరూ పాటించడానికి సిద్ధంగా ఉన్నామని అభ్యర్థులు తేల్చిచెప్పారు.

