పార్టీ స్థాయిలో చర్యలు తీసుకోవాలన్న డిమాండ్
ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడిన ఫైం ఖుర్షి, మత విద్వేష వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లను డిమాండ్ చేశారు. ముస్లింలపై ద్వేషం పెంచే నాయకులను బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఇటువంటి నేతలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
బీఆర్ఎస్కు మైనస్‌గా మారుతున్న నాయకత్వం?
ఈ సందర్భంగా రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చ మొదలైంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి పూర్తిగా మారిందని, గతంలో ఉన్న పార్టీకి ఇప్పుడు ఉన్న పార్టీకి తేడా స్పష్టంగా కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకప్పుడు ప్రజల్లో బలమైన పట్టున్న పార్టీగా ఉన్న బీఆర్ఎస్, ప్రస్తుతం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితికి చేరుకుందని విశ్లేషకులు అంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో పాడి కౌశిక్ రెడ్డి లాంటి నేతలు పార్టీకి ప్లస్ కంటే మైనస్‌గా మారుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాటల నియంత్రణ లేకుండా, సందర్భం, సమయం ఏమిటో కూడా పట్టించుకోకుండా వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని విమర్శలు వస్తున్నాయి.
నియోజకవర్గ అభివృద్ధిపై ప్రశ్నలు
ఎమ్మెల్యేగా గెలవకముందు ప్రజల ముందు వేడుకుని ఓట్లు అడిగిన నేత, గెలిచిన తర్వాత కనీసం నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్న ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి.
ఎప్పుడూ హైదరాబాద్‌కే పరిమితమై, నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టడం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉండాల్సిన వ్యక్తి ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన బదులు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాజకీయ రాద్దాంతం సృష్టిస్తున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హెచ్ఆర్సి విచారణపై ఉత్కంఠ
ఈ వ్యవహారంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన ఆదేశాలతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. డిజీపీ సమర్పించనున్న నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. మత విద్వేష వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు ఉంటాయా? పార్టీ అంతర్గతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది.

