పాలకుర్తిలో కాంగ్రెస్‌కు అత్తా–కోడళ్ల బెడద..?

ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, జాన్సీ రెడ్డిపై అసంతృప్తి నేతల ఫిర్యాదు

పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆ పార్టీ అసంతృప్తి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త జాన్సీ రెడ్డి వ్యవహార శైలే ఇందుకు కారణమని ఆరోపిస్తూ, తక్షణమే పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల ఓటమికి ఇదే ప్రధాన కారణమని అసంతృప్తి వర్గం ఆరోపిస్తోంది. ఈ పరిస్థితి కొనసాగితే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీ ఘోర పరాజయం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ అంశంపై పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

గురువారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే క్వార్టర్స్, గాంధీభవన్‌లో జరిగిన సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు తెలిసింది. అభివృద్ధి పనుల పేరుతో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం జరిగిందని, కాలువల అభివృద్ధి పేరిట భారీగా నిధులు డ్రా చేశారని అసంతృప్తి నేతలు ఆరోపిస్తున్నారు. ఎంపీ నిధులు కూడా సరైన విధంగా వినియోగించలేదని, ఏ గ్రామానికి ఎంత ఖర్చు చేశారన్న వివరాలు ఇవ్వడం లేదని వారు పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 47 వేల ఓట్ల భారీ మెజారిటీ ఇచ్చిన పాలకుర్తి ప్రజలు, ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు సుమారు 2 వేల ఓట్ల ఆధిక్యం ఇచ్చారని, ఇది ఎమ్మెల్యే, ఆమె కుటుంబ వ్యవహార శైలిపై పెరిగిన అసంతృప్తికి నిదర్శనమని నేతలు అభిప్రాయపడ్డారు. తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఒక్క కౌన్సిలర్ కూడా గెలిచే పరిస్థితి లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలవడం అప్పట్లో పార్టీకి ప్లస్ అయ్యిందని, కానీ ప్రస్తుతం నియోజకవర్గంలో నిర్ణయాలన్నీ ఆమె అత్త చేతిలోనే ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ‘షాడో ఎమ్మెల్యే’గా జాన్సీ రెడ్డి వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి.

ఇదిలా ఉండగా, పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో ఫిరాయింపు నేతలకు పదవులు, ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తున్నారన్న అంశంపై కూడా అసంతృప్తి నేతలు గళం విప్పారు. మొదటి నుంచి కాంగ్రెస్ కోసం పనిచేసిన తమకు ఇప్పటివరకు సరైన గుర్తింపు లేదని, ఇదే విధంగా కొనసాగితే పార్టీ లోపలే రెండు వర్గాలుగా చీలే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

ఈ అంశాలపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్… అభ్యర్థుల ఎంపికకు ముందే చర్చ జరగాలని, ఒకసారి పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తే అందరూ కలిసికట్టుగా పని చేయాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే, ఈ సమస్యలను అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందన్నది ఇప్పుడు పాలకుర్తి రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *