ఫుట్‌బాల్‌పై కోట్లు… రైతు బంధు, ఉద్యోగాలపై మౌనం: గుంపు మేస్త్రి పాలనపై పావని గౌడ్ ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై ప్రశ్నలు పెరుగుతున్న వేళ, పావని గౌడ్ తీవ్ర వ్యాఖ్యలతో అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే, ఫుట్‌బాల్ కార్యక్రమాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఏంటి అని ఆమె నిలదీశారు.

రైతు బంధుకు నిధులు లేవని, గురుకులాల్లో పిల్లలకు సరైన భోజనం పెట్టడానికి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదని, కానీ ఫుట్‌బాల్ కోసం మాత్రం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అని ప్రశ్నించారు.

సింగరేణి కార్మికులు చెమట, రక్తంతో సంపాదించిన ప్రజా ధనం ప్రభుత్వ ప్రచారాలకు, ఫుట్‌బాల్ ఈవెంట్లకు వినియోగిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగాల కోసం ఢిల్లీకి వెళ్తే అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి ఉందని, కానీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ల కోసం మాత్రం నాయకులు దేశం తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..

గతంలో ఫార్ములా ఈ రేస్ పేరుతో పెట్టుబడులు వచ్చాయని చెప్పుకున్న ప్రభుత్వమే, ఇప్పుడు ఫుట్‌బాల్ పేరుతో ఎంత పెట్టుబడి తెస్తుందో చెప్పాలని ఆమె సవాల్ విసిరారు. రైతు బంధు ఇవ్వలేని ప్రభుత్వం ఫుట్‌బాల్ ఆడించడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందా? అని నిలదీశారు.

సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే తమ “ఫుట్‌బాల్” ఆడించారని వ్యాఖ్యానించిన పావని గౌడ్, రాబోయే రోజుల్లో మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, మొత్తం తెలంగాణ సమాజమే ప్రభుత్వంతో రాజకీయ ఫుట్‌బాల్ ఆడుతుందని హెచ్చరించారు. ప్రజల సమస్యలు పరిష్కరించకుండా వినోదాలపై ఖర్చు చేయడమే ఈ పాలన లక్షణమని ఆమె తీవ్రంగా విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *