తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధానంగా డేటా ధ్వంసం వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయి? అనే అంశం ఇప్పుడు వార్తల్లో ప్రధానంగా చర్చకు వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎస్ఎస్ఐబి కార్యాలయంలోని హార్డ్ డిస్క్‌ల డేటాను ఎందుకు ధ్వంసం చేశారన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. సుమారు ఏడు గంటలకు పైగా కొనసాగిన ఈ విచారణలో, సిరిసిల్లలో ఏర్పాటు చేసిన వార్ రూమ్ ఉద్దేశం ఏమిటి, అక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరిగాయి, కాంగ్రెస్ నేతల ఆర్థిక లావాదేవీల సమాచారం తమ వద్దకు ఎలా వచ్చిందన్న అంశాలపై సిట్ అధికారులు ఆరా తీసినట్టు తెలుస్తోంది.
అయితే తనను రాధాకృష్ణ రావుతో కలిపి విచారించారన్న వార్తలను కేటీఆర్ ఖండించారు. విచారణ గదిలో తాను ఒక్కడినే ఉన్నానని, తనతో పాటు ఎవరినీ కూర్చోబెట్టి విచారణ జరపలేదని స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు రాధాకృష్ణ రావుతో కలిపి విచారించారంటూ కథనాలు ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది.
సిట్ అధికారులు అడిగిన ప్రశ్నల్లో ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు పోస్టింగ్ నిర్ణయాలు, ఎన్నికల సమయంలో వాట్సాప్, సిగ్నల్ యాప్స్ ద్వారా జరిగిన సంభాషణలు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, సినీ ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే 2023 ఎన్నికల సమయంలో పార్టీకి వచ్చిన విరాళాలు, ఎలక్ట్రోరల్ బాండ్స్, రియల్ ఎస్టేట్, ఫార్మా వ్యాపారులపై నిఘా అంశాలపై కూడా వివరణ కోరినట్టు సమాచారం.
విచారణ సందర్భంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కేటీఆర్‌తో పాటు వచ్చిన ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేపీ వివేకానందను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టి, సిట్ చర్యలను రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించారు.
మరోవైపు హైదరాబాద్ సీపీ సజ్జనార్ విడుదల చేసిన లేఖలో, కేటీఆర్ స్టేట్మెంట్‌ను ఇతర సాక్షుల వాంగ్మూలాలతో కలిపి విశ్లేషిస్తున్నామని, దర్యాప్తు పూర్తిగా చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా సాగుతుందని తెలిపారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని, సాక్షులను ప్రభావితం చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించారు.
అయితే రాజకీయంగా చూస్తే, ఇదే తరహాలో గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్, కార్ రేస్, గొర్రెల స్కామ్, పేపర్ లీకేజ్ వంటి అంశాల్లో కూడా సిట్ నోటీసులు, విచారణలు జరిగినప్పటికీ ఇప్పటివరకు గణనీయమైన పురోగతి లేదన్న విమర్శలు ఉన్నాయి. అరెస్టులు లేకుండా, విచారణలు మాత్రమే సాగుతూ చివరకు ప్రజలు ఆ అంశాలను మర్చిపోవడమే జరుగుతోందన్న అభిప్రాయం బలపడుతోంది.
మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా రాజకీయ ఆరోపణలు–ప్రతిఆరోపణల మధ్య నడుస్తూ, నిజమైన చర్యలు ఎప్పుడు కనిపిస్తాయన్న ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం దొరకని పరిస్థితి కొనసాగుతోంది.

