మున్సిపల్ ఎన్నికలపై మంత్రుల అనాశక్తి: క్షేత్ర స్థాయికి దూరంగా కాంగ్రెస్ ప్రభుత్వం?

తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మంత్రుల అనాశక్తి, క్షేత్ర స్థాయికి వెళ్లేందుకు ఆసక్తి లేకపోవడం పార్టీకి పెద్ద సవాలుగా మారిందన్న నివేదికలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వానికి అందిన నిఘా వర్గాల నివేదికల ప్రకారం, లోక్‌సభ నియోజకవర్గాల వారిగా ఇంచార్జీలుగా నియమించిన మంత్రుల్లో సగం మంది ఇప్పటికీ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ నెల 18న మేడారంలో జరిగిన క్యాబినెట్ సమావేశం తర్వాత మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై మంత్రులకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోపు క్షేత్ర స్థాయిలో పర్యటించి పార్టీ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే వారం రోజులు గడిచినా సగం మంది మంత్రులు మాత్రమే పార్టీ కేడర్‌తో సమావేశాలు నిర్వహించారని, మిగతావారు ప్రజలను ఎదుర్కొనేందుకు వెనుకంజ వేస్తున్నారని సమాచారం.

గ్రౌండ్ లెవెల్లో మంత్రులు ఎదుర్కొనే పరిస్థితులే ఈ నిరాసక్తికి కారణమన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రజలు నేరుగా “చీరలు వద్దు, గీరలు వద్దు… మాకు రూ.2500 ఎక్కడ?” అంటూ నిలదీస్తున్నారని, ఆరు గ్యారెంటీలు, 417 హామీల అమలుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఫ్రీ బస్ తప్ప మిగతా హామీలు పూర్తి స్థాయిలో అమలుకాలేదన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది.

రైతు భరోసా, రుణమాఫీ, కల్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాల అమలుపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైతు భరోసా ఇప్పటికీ అందని రైతులు ఉన్నారని, రుణమాఫీ ఎవరికీ పూర్తిగా జరిగిందో స్పష్టత లేదని విమర్శలు వస్తున్నాయి. కల్యాణ లక్ష్మీ చెక్కులు అరుదుగా మాత్రమే ఇచ్చారని, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో రాజకీయ అనుబంధాల ఆధారంగా లబ్ధి చేకూరుతోందన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.

ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అసలు సమస్య డబ్బు విడుదల కాదని, నిజంగా ఇల్లు లేని నిరుపేదలకే లబ్ధి చేరుతోందా లేదా అన్నదే కీలకమని విశ్లేషకులు అంటున్నారు. నాలుగు ఇళ్లు ఉన్నవారికి ఇల్లు మంజూరు అవుతుంటే, అప్లై చేసిన నిజమైన పేదలకు అవకాశం రాకపోవడం ప్రభుత్వం విశ్వసనీయతను దెబ్బతీస్తోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అంశంపై సమగ్ర సర్వే, పారదర్శకత అవసరమన్న డిమాండ్ పెరుగుతోంది.

వచ్చే నెల రెండున సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో, ఈ నివేదికలు పార్టీకి హెచ్చరికలుగా మారాయి. మున్సిపల్ ఎన్నికలను తేలిగ్గా తీసుకుంటే, ప్రజా అసంతృప్తి బ్యాలెట్ బాక్స్‌లో ప్రతిబింబించే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి, సంక్షేమ పథకాల ప్రకటనలు, కోట్ల రూపాయల విడుదలలకంటే గ్రౌండ్ లెవెల్లో నిజమైన లబ్ధిదారుడికి న్యాయం జరిగిందా లేదా అన్నదే ప్రజల అసలు ప్రశ్నగా మారింది. ఆ ప్రశ్నకు సమాధానం దొరకకపోతే, మంత్రుల నిరాసక్తి కాంగ్రెస్‌కు రాజకీయంగా భారీ మూల్యం చెల్లించించవచ్చన్న అభిప్రాయం బలపడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *