ఫోన్ ట్యాపింగ్ విచారణలో కక్షసాధింపు లేదు.. చట్టం తన పని తాను చేస్తుంది: కాంగ్రెస్ స్పష్టం

గత పదేళ్ల పాలనలో జరిగిన తప్పిదాల నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశమైన ఫోన్ ట్యాపింగ్, డ్రోన్ ట్రాఫిక్ వ్యవహారాలపై చట్టబద్ధంగా విచారణ కొనసాగుతున్న తరుణంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎవరిపైనా వ్యక్తిగత కక్ష సాధింపుల ఆలోచన లేదని, గతంలో ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా పనిచేసిన వారిపట్ల గౌరవం చూపే సంప్రదాయం తమ ప్రభుత్వానికి ఉందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర గౌరవాన్ని కించపరిచేలా ఫోన్ ట్యాపింగ్ వంటి అక్రమ చర్యలకు పాల్పడిన వారిపై విచారణ జరపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వెల్లడించింది.

దేశ భద్రత, తీవ్రవాద నిరోధం, యుద్ధ సమయాల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టబద్ధంగా ఉపయోగించాల్సిన సాధనమని పేర్కొంది. కానీ రాష్ట్రంలో రాజకీయ నాయకులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, అధికారులు ఇలా ఎవ్వరినీ వదలకుండా అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు స్పష్టమైన ఆధారాలు లభించాయని తెలిపింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసి న్యాయపరంగా, చట్టపరంగా విచారణ జరుపుతోందని కాంగ్రెస్ వివరించింది. ఇది కక్షసాధింపు కాదు, బాధ్యతాయుతమైన చర్య మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ అంశంపై బీజేపీ నేతలు విశ్వేశ్వర్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా విచారణ జరపాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేసింది.

తప్పు చేయని వారు విచారణలో బయటపడతారని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. వ్యక్తిగత సంభాషణలు, కుటుంబ వ్యవహారాలు, వ్యాపార లావాదేవీలను అక్రమంగా వినడం అత్యంత నీచమైన చర్యగా అభివర్ణించింది. ఈ దుష్కార్యానికి పాల్పడిన వారిపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని పేర్కొంది.

ముఖ్యమంత్రి ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు రాజకీయ స్టంట్లు చేస్తున్నారని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో లాభపడాలనే లక్ష్యంతోనే ఈ ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రజలు ఈ అంశంపై ఆలోచించాలని, గోబెల్స్ ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *