రోడ్డు మీద కాదు.. అసెంబ్లీలో చర్చిద్దాం: కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌

తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రోడ్డు మీద విమర్శలు కాదు, అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన తేనేటి విందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం, కృష్ణా గోదావరి జలాల అంశంపై సభలో చర్చకు సిద్ధమా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.

కృష్ణా జలాల్లో 36 శాతం వాటాకు సంబంధించి కేసీఆర్ సంతకం చేశారని ఆరోపించిన రేవంత్ రెడ్డి, అందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. కేసీఆర్ చేసిన ఆ సంతకమే బీఆర్ఎస్ ఓటమికి కారణమైందని, ప్రజలు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్ గతాన్ని మాత్రమే విమర్శిస్తూ, అసెంబ్లీకి రావడాన్ని తప్పించుకుంటున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ పాలనలో ఉమ్మడి ఏపీ కంటే ఎక్కువ అన్యాయం జరిగిందని సీఎం విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టును పొగడ్తలతో ముంచిన కేసీఆర్ వీడియోలను సభలలో ప్రదర్శిస్తామని హెచ్చరించారు. కాళేశ్వరం లేకున్నా తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి పండుతోందని, గత పాలనలో ఆర్థిక అవినీతి జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్, కేటీఆర్‌లను “ఆర్థిక ఉగ్రవాదులు”గా అభివర్ణిస్తూ మాటల తూటాలు పేల్చారు.

అయితే మరోవైపు, కేసీఆర్ ఇటీవల చేసిన ప్రెస్‌మీట్‌ను ఉదాహరణగా తీసుకుంటూ, ఆయన వ్యక్తిగత దూషణలకు దూరంగా హుందాతనంతో మాట్లాడారని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ యాసలో మాట్లాడినా, ఆయన భాషలో అసభ్యత లేదని చెబుతున్నారు. దీనికి భిన్నంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో పదజాలం తగినదేనా అనే చర్చ కూడా మొదలైంది.

ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సహజమే అయినా, వ్యక్తిగత విమర్శలకు దిగడం సరైంది కాదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. “దమ్ముంటే అసెంబ్లీకి రా” అనే సవాళ్లు రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ మాటల యుద్ధం సభలో చర్చగా మారుతుందా, లేక రోడ్డుమీదే కొనసాగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *