నిన్న రేవంత్ రెడ్డి బావమరిది భాగవతంపై ఆరోపణలు బయటపెట్టిన వెంటనే తనకు నోటీసులు పంపించడమే రాజకీయ డైవర్షన్ టాక్టిక్స్ అని బీఆర్ఎస్ నేత తీవ్ర స్థాయిలో విమర్శించారు. సాయంత్రం దాదాపు రాత్రి 9 గంటల సమయంలో తన ఇంటికి వచ్చి, తాను హైదరాబాద్‌లో లేని సమయంలో మేడుకు నోటీసులు ఇచ్చి వెళ్లారని తెలిపారు.
సిద్ధిపేట నియోజకవర్గంలో ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటున్న సమయంలో ఈ ఘటన జరిగిందని, అయినా కూడా చట్టాన్ని గౌరవిస్తూ రాత్రికే హైదరాబాద్ చేరుకొని ఈరోజు ఉదయం హాజరయ్యేందుకు సిద్ధమయ్యామని స్పష్టం చేశారు. తమకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.
బావమరిది భాగవతంపై చేసిన ఆరోపణలకు ప్రభుత్వం గానీ, ఒక్క మంత్రి గానీ స్పందించకపోవడమే నిజాలు బయటపడినందుకే నిదర్శనమని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల ముందు అవినీతి బట్టబయలవుతుందనే భయంతోనే ఈ నోటీసులు పంపిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమ కాలంలో ఎన్నో కేసులు, అరెస్టులు ఎదుర్కొన్నామని గుర్తు చేస్తూ, అప్పుడూ భయపడలేదని, ఇప్పుడూ భయపడే ప్రశ్నే లేదన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ప్రశ్నించడమే తమ తప్పా? అని నిలదీశారు. మహిళలకు మహాలక్ష్మి రూ.2500, వృద్ధులకు రూ.4000 పెన్షన్, రైతు బంధు వంటి హామీలు ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు.
బొగ్గు కుంభకోణం, పవర్ స్కాం, భూ కుంభకోణాలు, హిల్ టాప్ ఇండస్ట్రీస్ అంశాలపై అసెంబ్లీ వేదికగా, ప్రజావేదికగా ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. సింగరేణి అవినీతిపై కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ఓపెన్ లెటర్ రాస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే అన్ని ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టివేశాయని గుర్తు చేస్తూ, అదే అంశాన్ని మళ్లీ మళ్లీ లేవనెత్తడం రాజకీయ డ్రామా తప్ప మరొకటి కాదన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ నోటీసులన్నీ అని ఆరోపించారు.
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయంతోనే రేవంత్ రెడ్డి భయపడ్డారని, మున్సిపల్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ బలమైన ప్రత్యర్థిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎంత డైవర్షన్ చేసినా అవినీతిపై ప్రశ్నించడం ఆపేది లేదని, తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

