తెలంగాణ శాసనసభలో సోమవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విపక్ష నేత మరియు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్వయంగా వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందని అడిగి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఉదయం 10:29 గంటలకు కేసీఆర్ శాసనసభలోకి ప్రవేశించగా, ఒక్క నిమిషం తరువాత సీఎం రేవంత్ రెడ్డి సభలోకి వచ్చారు. తన సీటు వద్ద నుంచే కేసీఆర్‌కు నమస్కరించిన సీఎం, స్పందన లేకపోవడంతో లేచి వెళ్లి స్వయంగా నమస్కారం చేసి కరచలనం చేశారు. అనంతరం ఆరోగ్యం గురించి ఆరా తీసి తిరిగి తన స్థానానికి వెళ్లారు.
సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్కతో పాటు పలువురు కాంగ్రెస్ సభ్యులు కూడా కేసీఆర్‌ను పలకరించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సహా పలువురు ఎమ్మెల్యేలు ఆయనకు నమస్కారం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సభలోకి రాగానే కేసీఆర్‌తో పాటు 17 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేచి నిలిచారు. అయితే కేటీఆర్, కౌశిక్ రెడ్డి తదితరులు తమ సీట్లలోనే కూర్చుని ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్లలో ఇది ఆరవ అసెంబ్లీ సమావేశం. గతంలో కూడా ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నేతలను పలకరించిన సందర్భాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతగా జానారెడ్డిని ఆత్మీయంగా పలకరించిన ఉదాహరణలు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు.
ఈ సమావేశాలపై కేసీఆర్ హాజరు ఉంటారా లేదా అనే అంశంపై ముందుగా విస్తృత చర్చ సాగింది. ఇటీవల బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం అనంతరం కేసీఆర్ “ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క” అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రకటించారు. దీంతో ఆయన సభలో ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తారని భావించారు. కానీ కేసీఆర్ కేవలం ఏడు నిమిషాల పాటు మాత్రమే సభలో ఉండి, సంతాప తీర్మానాలు కొనసాగుతుండగానే బయటకు వెళ్లిపోయారు.
శాసనసభలో దివంగత మాజీ మంత్రులు, సభ్యులకు నివాళులు అర్పించడం, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక వంటి అంశాలే ప్రధాన అజెండాగా ఉండటంతో పెద్ద చర్చ జరగలేదు. సీఎం రేవంత్ రెడ్డి కూడా 10:40 గంటలకు సభ నుంచి నిష్క్రమించారు. సీఎం కంటే నాలుగు నిమిషాల ముందే కేసీఆర్ వెళ్లడం గమనార్హం.
అసెంబ్లీ సమావేశాలు రెండో తేదీ నుంచి ఐదో తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో, కేసీఆర్ మళ్లీ హాజరవుతారా? ప్రభుత్వాన్ని నిలదీస్తారా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రెండేళ్ల తర్వాత ఆయన అసెంబ్లీలో కూర్చోవడం కొత్త అనుభవంలా కనిపించిందని కొందరు అభిప్రాయపడుతున్నారు

