జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడి రోజురోజుకీ పెరుగుతోంది. కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బరిలోకి దిగడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఐదు రోజుల పాటు రోడ్ షోలు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. అయితే ఈ రోడ్ షోల అవసరం ఉందా అనే ప్రశ్నలు ప్రజలలో వినిపిస్తున్నాయి.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల కోసం పనిచేయడమే తన ప్రాధాన్యత కావాలి కానీ ఎన్నికల కోసం తిరిగి రోడ్లపైకి రావడం సరైన పద్ధతి కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రోడ్ షోలు చేయడం అంటే ఆ స్థాయి తగ్గించుకోవడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ప్రజల దృష్టిలో మాత్రం ఈ రోడ్ షోలు పెద్ద ఇబ్బందిగా మారుతున్నాయి. ట్రాఫిక్ జామ్‌లు, రహదారి బ్లాక్‌లు, ఆఫీసులకు వెళ్ళే ఉద్యోగుల కష్టాలు—ఇవన్నీ ప్రజా జీవితాన్ని దెబ్బతీస్తున్నాయి. జూబ్లీహిల్స్ ప్రాంతం స్వభావత బిజీ ఏరియా కావడంతో రోడ్ షోలు కారణంగా మూడు రోజుల పాటు రోడ్లు బ్లాక్ అవుతాయన్న ఆందోళన ఉంది.
విమర్శకుల అభిప్రాయం ప్రకారం, ప్రభుత్వం ప్రజల హామీలను నెరవేర్చినట్లయితే ఈ రోడ్ షోలు అవసరం ఉండేవి కావు. నిజంగా రెండు సంవత్సరాల పాలనలో పనులు సక్రమంగా జరిగి ఉంటే ప్రజలు స్వయంగా కాంగ్రెస్‌ను ఆశీర్వదించేవారని అంటున్నారు.
ఉపఎన్నికలో ఎవరు గెలిచినా రాష్ట్ర రాజకీయాలపై పెద్ద ప్రభావం ఉండదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారంలోకి దిగడం రాజకీయ సమీకరణాలను కదిలించేలా ఉంది.
జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రం ఒకే మాట చెబుతున్నారు — “ప్రచారం కంటే ప్రజా ఇబ్బందులు తగ్గించండి సీఎం గారూ!”

