ధర్మగిరి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగిన ఘటన కలకలం రేపింది. దేవుడికి గంజాయిని ప్రసాదంగా పెట్టి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటన శంషాబాద్లో చోటు చేసుకుంది. ఆలయానికి వచ్చిన ఇద్దరు యువకులు శివుడికి ప్రత్యేక ప్రసాదం పెట్టేందుకు వచ్చామని చెప్పి చేతిలో గంజాయి చూపిస్తూ వీడియో తీశారు. అనంతరం దానిని దేవుడి ముందు ఉంచి వీడియోను Instagramలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
వీడియో విషయం సి.వి. సజ్జనార్ దృష్టికి వెళ్లడంతో ఆయన సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. దేవాలయాల్లో మాదక ద్రవ్యాలతో రీల్స్ చేయడం అసహ్యకరమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దీంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి చార్మినార్ టాస్క్ ఫోర్స్ను రంగంలోకి దించారు. నిందితులను పట్టుకుని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్కు అప్పగించారు. వారి మీద కేసు నమోదు చేశారు.
ఈ ఘటనతో మాదక ద్రవ్యాల వినియోగం, రీల్స్ కోసం యువత చేసే అతి చర్యలపై మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా హైదరాబాద్లో గంజాయి సులభంగా అందుబాటులోకి ఎలా వస్తుందన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
రీల్స్ వైరల్ కావాలనే ఆశతో కొందరు యువకులు మత భావాలను అవమానించే చర్యలకు కూడా వెనుకాడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

