సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని సంబంధిత మంత్రి శాసనసభలో స్పష్టం చేశారు. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడుతూ, హాస్పిటల్స్, నియామకాలు, రిటైర్డ్ ఉద్యోగుల సదుపాయాలు, భవిష్యత్తు కార్యాచరణపై కీలక ప్రకటనలు చేశారు.
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విషయంలో ఇప్పటికే కార్డియాలజీ, ఆంకాలజీ వంటి విభాగాల్లో రిఫరల్ హాస్పిటల్స్‌ను పరిశీలిస్తున్నామని తెలిపారు. ఖాళీగా ఉన్న హాస్పిటల్స్‌లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతపై స్పందిస్తూ, ప్రస్తుతం 11 మంది కాంట్రాక్ట్ డాక్టర్లు పనిచేస్తున్నారని, మిగిలిన 32 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశామని చెప్పారు. అదేవిధంగా 175 మంది పారామెడికల్ సిబ్బంది నియామక ప్రక్రియ కొనసాగుతోందని, 2026 మార్చి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందన్నారు.
రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా వైద్య సదుపాయాలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. సీపీఆర్‌ఎంఎస్ (CPRMS) స్కీమ్ ద్వారా రిటైర్డ్ ఎంప్లాయీస్‌కు రూ.8 లక్షల వరకు మందుల సదుపాయం అందుబాటులో ఉందని, ఇతర టర్మినల్ బెనిఫిట్స్ కూడా పూర్తిగా అందించామని స్పష్టం చేశారు.
క్యాథ్ ల్యాబ్ అంశంపై స్పందిస్తూ, పీపీపీ మోడల్‌లో కాంట్రాక్ట్ అవార్డ్ చేయడం జరిగిందని, రామగుండం కేంద్రంగా 75 రోజుల్లో సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఉద్యోగుల క్వార్టర్స్ విషయమై, రిటైర్డ్ ఉద్యోగులు ఖాళీ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే అంశాన్ని బోర్డులో చర్చించి, సాధ్యమైన మార్గాలను పరిశీలిస్తామని చెప్పారు.
సింగరేణి భవిష్యత్తుపై మాట్లాడిన మంత్రి, ఒకప్పుడు బొగ్గు ఉత్పత్తిలో మోనోపలి ఉండేదని, ప్రస్తుతం ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ కారణంగా తీవ్రమైన పోటీ నెలకొందని అన్నారు. బొగ్గు బ్లాక్స్‌ను వేలం ద్వారా కేటాయిస్తున్న పరిస్థితుల్లో, సింగరేణి కూడా ప్రైవేట్ సంస్థలతో పోటీ పడాల్సి వస్తోందన్నారు. తక్కువ ధరకు బొగ్గు సరఫరా చేసే సంస్థల నుంచే కొనుగోళ్లు జరుగుతున్నందున, సింగరేణి ఉత్పత్తి ఖర్చులను తగ్గించి పోటీకి తగిన విధంగా మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
సింగరేణిని కాపాడుకోవడం ఉద్యోగుల భవిష్యత్తు, వారి కుటుంబాల భద్రతకు అత్యంత కీలకమని పేర్కొంటూ, శాసనసభ సమావేశాల అనంతరం ఎమ్మెల్యేలు, మంత్రులు, సింగరేణి సిబ్బంది, సీఎండీ, డైరెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు.
కార్మికుల సంక్షేమంలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా సింగరేణి కార్మికులకు రూ.1 కోటి ప్రమాద బీమా పథకాన్ని అమలు చేసిందని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం లేదా సింగరేణిపై ఒక్క రూపాయి భారం లేకుండా బ్యాంకుల ద్వారా ఈ బీమా అమలు చేస్తున్నామని, ఇదే పథకం విద్యుత్ శాఖ, డిస్కమ్స్, ఎనర్జీ రంగ కార్మికులకు కూడా వర్తింపజేస్తున్నామని చెప్పారు.
సింగరేణి కార్మికుల సంక్షేమం, సంస్థ భవిష్యత్తు రెండింటినీ సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

